
టాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పీఆర్వో బీఏ రాజు కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో ఆయన కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కాగా బీఏ రాజు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు రావడంతో ఈ మరణం సంభవించింది. దీంతో ప్రాణాలు కోల్పోయారు.
*ప్రస్థానం
సినిమా జర్నలిస్టుగా కేరీర్ ను ప్రారంభించిన బీఏ రాజు చాలా మంది అగ్రనటులకు పీఆర్వోగా వ్యవహరించారు. మహేష్ బాబు పీఆర్వోగా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. దీంతో పాటు ఆయన పలు సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు.
బీఏ రాజు నిర్మాతగా గుండమ్మగారి మనవడు, ప్రేమికులు, చంటిగాడు, లవ్లీ, సవాల్, వైశాఖం వంటి చిత్రాలను నిర్మించాడు. ‘సూపర్ హిట్’ మ్యాగజైన్ సంపాదకుడిగా.. నిర్వాహకుడిగా వ్యవహరించారు.
బీఏ రాజు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం బీఏ రాజు భార్య, దర్శకురాలు జయ కూడా కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు.