
మూడు దశాబ్దాల క్రితం భారత దేశంలో టివి ప్రేక్షకుల విశేష ఆదరణ పొంది, ఒక విధంగా టివి రేటింగ్స్ లలో సంచలనం కలిగించిన రామానందసాగర్ సీరియల్ `రామాయణ’ను మరోసారి దూరదర్శన్ నేషనల్ లో ప్రసారం చేయనున్నారు. కోవిద్-19 మహమ్మారితో దిగ్బంధనంతో ఇళ్లకే పరిమితమైన ప్రజలను అక్డట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తగిన సమయం అని చూస్తున్నట్లుంది.
వాస్తవానికి 2014 ఎన్నికల ముందే 2013లో జీ టివిలో ఈ సీరియల్ ను వేయాలని బిజెపి నేతలు ప్రయత్నం చేశారు. అయితే అప్పటిలో కేంద్రంలో అధికారంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం ఆధీనంలోని దూరదర్శన్ అందుకు అనుమతి ఇవ్వలేదు. దానితో ఇప్పుడు దూరదర్శన్ ద్వారానే ప్రసారం చేయనున్నారు.
భారతీయ సంస్కృతిలో మూలాధారమైన గ్రంధాలలో ఒకటైన రామాయణం ఆధారంగా దీనిని చిత్రీకరించారు. వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరితమానస ల ఆధారంగా, చారిత్రాత్మక సంఘటనలను ఉదహరిస్తూ రామనాదసాగర్ ఈ సీరియల్ ను ఎంతో హృద్యంగా చిత్రీకరించారు.
ఈ సీరియల్ ప్రసారం విషయాన్ని కేంద్ర ప్రసారశాఖమంత్రి ప్రకాశ్ జవడేకర్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘ ఎంతో సంతోషంగా ఉంది.. ప్రజల డిమాండ్ మేరకు రామాయణాన్ని మరోసారి టీవీల్లో ప్రచారం చేస్తున్నాం. మార్చి 28 (శనివారం) నుంచి ఈ సీరియల్ ప్రారంభం కాబోతుంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 9 నుంచి 10 గంటల వరకు డీడీ నేషనల్ (దూరదర్శన్) చానల్‌లో ప్రసారం కానుంది’ అని కేంద్రమంత్రి ప్రకటించారు.
ఈ సీరియల్ తొలిసారి 1987 నుంచి 1988 మధ్య కాలంలో దూరదర్శన్‌లో ప్రసారమైన విషయం తెలిసిందే. ఈ సీరియల్ భారతీయటెలివిజన్ రేటింగ్స్‌లో ఓ సంచలనంగా నిలిచింది. ఎంతోమంది ఆదరాభిమానాలను సొంతం చేసుకుని టెలివిజన్ రంగంలో ఓ మైలురాయిగా నిలిచింది.