
దేశంలో కరోనా మహమ్మారి వేలాది మందిని పొట్టన పెట్టుకుంటోంది. వైరస్ బారిన పడి నిత్యం 3 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోతుండగా.. వారిలో అత్యధికులు ఆక్సీజన్ అందకనే చనిపోతున్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న ఆక్సీజన్ చాలకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో.. దాదాపు 40 దేశాలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మనవంతు సహాయం చేద్దాం రండి అని ఆహ్వానిస్తున్నారు సినీ నటి ప్రణీత. ఆక్సీజన్ అందక ఎన్నో వేల ప్రాణాలు పోతున్నాయని ప్రణీత ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఆక్సీజన్ అందక ప్రాణాలు కోల్పోవడం దారుణమని, ఈ సమస్యను అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు.
ఆక్సీజన్ కోసం తన వంతుగా లక్ష రూపాయల విరాళం అందిస్తున్నట్టు ప్రకటించారు ప్రణీత. మిగిలిన వారు కూడా తమవంతు సహాయం అందించాలని కోరారు. మీరు చేసే సహాయం ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకుంటుందని, దయచేసి అందరూ సహకరించాలని కోరారు ప్రణీత.
కాగా.. దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. ఒక రోజులు నమోదయ్యే కేసుల సంఖ్య 4 లక్షలు దాటిపోయింది. ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. దీంతో.. జనం బెంబేలెత్తిపోతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సీజన్ అందక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.