Prakash Raj- Vishal: నటుడు ప్రకాష్ రాజ్ రాజకీయంగా క్రియాశీలకంగా ఉంటారు. ముఖ్యంగా ఆయన బీజేపీ ప్రభుత్వ పాలన, విధివిధానాలు తీవ్ర స్థాయిలో తప్పుబడతారు. ప్రధాని మోడీ అంటే ప్రకాష్ రాజ్ కి అసలు గిట్టదు. ఆయన్ని ఆకాశానికి ఎత్తిన వాళ్లపై కూడా ఆయన సెటైర్స్ వేస్తారు. తాజాగా హీరో విశాల్ ఇదే విషయంలో ప్రకాష్ రాజ్ కోపానికి కారణమయ్యాడు. మోడీని పొగుడుతూ విశాల్ ట్వీట్ చేసిన క్రమంలో ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విశాల్ ట్వీట్ ట్యాగ్ చేస్తూ సెటైర్ వేశాడు.

విశాల్ ఇటీవల కాశీ వెళ్లారట. అక్కడ సౌకర్యాలు, శుభ్రతకు విశాల్ ముగ్ధుడయ్యాడట. అదే విషయాన్ని తెలియజేస్తూ ఒక ట్వీట్ చేశారు. ”నేను కాశీ సందర్శించాను. పవిత్ర గంగా జలం తాకాను. గుడి, పరిసరాలు మీరు పునరుద్ధరించిన తీరు అద్భుతం. ఇప్పుడు కాశీని సందర్శించడం అత్యంత సులభం. దర్శనం కూడా బాగా అయ్యింది. మీకు హ్యాట్సాఫ్, సెల్యూట్’ అని ట్వీట్ చేశారు. కాశీని పునరుద్ధరించిన తీరుకు మోడీని విశాల్ ఆకాశానికి ఎత్తాడు. ఆయన పరిపాలనా విధానాన్ని మెచ్చుకున్నారు.
ఈ పరిణామం నటుడు ప్రకాష్ రాజ్ కి ఆగ్రహం తెప్పించింది. విశాల్ ట్వీట్ ట్యాగ్ చేస్తూ ప్రకాష్ రాజ్ ” షాట్ ఓకే, వాట్ నెక్స్ట్???’ అని కామెంట్ చేశాడు. పరోక్షంగా నీ నటన ఆపని విశాల్ ని అన్నట్లు ప్రకాష్ రాజ్ కామెంట్ ఉంది. మోడీని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇలాంటి ట్వీట్స్ తో నటిస్తున్నారని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడినట్లు అయ్యింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ప్రకాష్ రాజ్ సెటైర్ పై విశాల్ ఎలా స్పందిస్తారనే సందిగ్ధత నెలకొంది.

ప్రకాష్ రాజ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మంగుళూరు పార్లమెంట్ స్థానం చేసి ఓడిపోయారు. ఎంపీగా పోటీ చేసి ఓడినప్పటికీ ఆయన రాజకీయంగా యాక్టీవ్ గానే ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మోడీ పాలన, ఆ ప్రభుత్వ, పార్టీ విధానాలు ప్రశ్నిస్తూ ఉంటారు. సెటైర్స్ పేలుస్తూ ఉంటారు. అలాగే గత ఏడాది జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేశారు. మంచు విష్ణుతో తలపడి ఓటమి పాలయ్యారు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసినా ప్రకాష్ రాజ్ విజయం సాధించలేకపోయారు. ఎన్నికలకు ముందు తర్వాత నానా హంగామా చేశారు. ఎన్నికలు చెల్లవంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు.