పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రేంజ్ ఏంటనేది చాటిచెప్పిన చిత్రం ‘వకీల్ సాబ్’. కరోనా కాలంలోనూ భారీ వసూళ్లు సాధించి, అందరినీ నివ్వెర పరుస్తోంది. ఏపీ లాంటి ప్రతికూలతలు ఎదురైనప్పటికీ.. రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ సాధించిందీ చిత్రం. తొలి రోజున రూ.45 కోట్ల గ్రాస్ ను రాబట్టిన సినిమా.. రెండో వారంలోనూ జోరు కొనసాగించింది.
అటు.. ఓవర్సీస్ లోనూ వకీల్ సాబ్ సత్తాచాటాడు. భారీ ఓపెనింగ్స్ దూసుకెళ్లిందీ సినిమా. లాక్ డౌన్ తర్వాత విడుదలైన ఈ భారీ చిత్రం.. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా కలెక్షన్లు సాధించింది. ఇప్పటికే.. 1 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది.
అయితే.. కరోనా సెకండ్ వేవ్ కలెక్షన్లపై ప్రభావం చూపించిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉన్నప్పటికీ.. కరోనా అడ్డుకుందని చెబుతున్నారు. గడిచిన మూడు రోజులుగా వసూళ్లు క్షీణించాయని సమాచారం. ముఖ్యంగా అమెరికాలో పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తోంది. ఓవర్సీస్ బ్రేక్ 1.3 మిలియన్ డాలర్స్ కాగా.. ఆ మార్కు చేరుతుందా? లేదా? అనే ఆందోళనకు కూడా బయ్యర్లలో ఉన్నట్టు చెబుతున్నారు.
అయితే.. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా పేర్కొనే ఉమైర్ సంధు మాత్రం.. ప్రపంచ వ్యాప్తంగా వకీల్ సాబ్ రూ.175 కోట్లు కలెక్ట్ చేసినట్టు ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు. ఆ మధ్య 100 కోట్లు అని చెప్పిన ఉమైర్.. ఆ తర్వాత 150 కోట్లు అని చెప్పాడు. తాజాగా.. 175కు పెంచాడు. అయితే.. కరోనా నేపథ్యంలో థియేటర్లకు వెళ్లడానికి జనం భయపడుతుంటే.. అన్ని కోట్లు ఎలా వచ్చాయో? అనే సందేహం వ్యక్తమవుతోంది చాలా మందిలో!
కాగా.. నిర్మాత దిల్ రాజు మాత్రం ఇప్పటికీ కలెక్షన్ల విషయంలో స్పందించలేదు. సినిమా ఎంత కలెక్ట్ చేసిందనేది బయటకు చెప్పడం పవన్ కూడా ఇష్టం ఉండదు. అందుకే.. మౌనంగా ఉన్నట్టు సమాచారం. మొత్తానికి.. మేకర్స్ సైలెంట్ గా ఉండడంతో.. ఎవరికి నచ్చిన లెక్కలు వాళ్లు చెప్పేస్తున్నారు.