Pooja Hegde: పూజా హెగ్డేకు బ్యాడ్ టైం నడుస్తుంది. ప్రస్తుతం బుట్టబొమ్మ చేతిలో అధికారికంగా ఒక్క సినిమా లేదు. విభేదాలతో గుంటూరు కారం మూవీ నుండి తప్పుకుంది. శ్రీలీల పాత్రకు ప్రాధాన్యత పెంచి, తన పాత్రకు తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకుందని పుకార్లు వినిపించాయి. అలాగే విజయ్ దేవరకొండకు జంటగా చేయాల్సిన జనగణమన మధ్యలో ఆగిపోయింది. దానికి తోడు వరుస ప్లాప్స్. 2022 నుండి ఆమెకు ఒక్క హిట్ లేదు.
రాధే శ్యామ్ తో మొదలైన పరాజయాల పరంపర కొనసాగుతోంది. రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో అమ్మడు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయింది. కాగా ఆమె ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ కొన్ని గాయాల ఫోటోలు పూజా హెగ్డే షేర్ చేసింది. దాంతో ఆమెకు ఏమైందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
మోకాళ్ళ వద్ద గాయాలకు సంబంధించిన ఫోటోలు పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. బాక్సింగ్ చేస్తూ గాయాలకు గురైనట్లు వివరణ ఇచ్చింది. మరి పూజా హెగ్డే బాక్సింగ్ ఎందుకు చేశారు? షూటింగ్ లో భాగమా? లేక వ్యాయామం చేస్తూ గాయపడ్డారా? అనేది ఆమె చెప్పలేదు. పూజా హెగ్డే గాయాలు చూసిన ఫ్యాన్స్ ఆమె త్వరగా కోలుకోవాలని అంటున్నారు. ఇటీవల పూజా హెగ్డే కాలికి సర్జరీ జరిగినట్లు వార్తలు వచ్చాయి. గతంలో ఆమె కాలికి కట్టుతో కనిపించిన నేపథ్యంలో ఈ పుకార్లకు బలం చేకూరింది.
ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన పూజా హెగ్డే, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ముకుంద చిత్రం చేసింది. హిట్స్ లేకున్నా హృతిక్ రోషన్ వంటి బడా స్టార్ మొహంజదారో చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రం నిరాశపరిచింది. రంగస్థలం మూవీలో ఐటెం సాంగ్ చేసిన పూజా కెరీర్ ముగుస్తుందన్న తరుణంలో త్రివిక్రమ్ బ్రేక్ ఇచ్చాడు. అరవింద సమేత వీర రాఘవతో హిట్ ట్రాక్ ఎక్కిన పూజా స్టార్స్ పక్కన నటించింది.