
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అనేది కేవలం తెలుగు సినిమా నటీనటులకు సంబంధించిన అంశం. ఇంకా చెప్పాలంటే.. పేద కళాకారుల సంక్షేమానికి సంబంధించిన కమిటీ. ఇలాంటి మా ఎన్నికలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయా? అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా.. సినీ నటుడు, బీజేపీ నేత సీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యానాలు అదే అభిప్రాయం కలిగిస్తున్నాయని అంటున్నారు.
మా అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన ప్రకాష్ రాజ్ ను బీజేపీ వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి అని సీవీఎల్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఓ టీవీ ఛానల్ లో నిర్వహించిన చర్చలో నరసింహారావు ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈయన వ్యాఖ్యలపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కమిటీకి సంబంధించిన ఎన్నికల్లోకి పార్టీలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఇంతేకాకుండా.. మరో అడుగు ముందుకు వేసిన సీవీఎల్.. ‘మా’ సంఘాన్ని కూడా విభజించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఒకటి, తెలంగాణకు మరొకటి ఏర్పాటు చేయాలని తాను కోరుతున్నట్టు చెప్పారు. కానీ.. ఈ విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదని అన్నారు.
ఇదే చర్చా గోష్టిలో సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు కూడా మట్లాడుతూ.. ఈ ఎన్నికలకు అప్పుడే తొందరేం వచ్చిందని అన్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏంటని కూడా ఆయన ప్రశ్నించారు. కోటా శ్రీనివాసరావు కూడా బీజేపీ మూలాలు ఉన్న నటుడే అన్న సంగతి తెలిసిందే.
ఈ పరిణామంపై పలువు విమర్శలు చేస్తున్నారు. కేవలం సినిమా వాళ్లకు సంబంధించిన ఈ అసోసియేషన్లో.. రాజకీయ పార్టీలను తీసుకురావడం సరికాదని అంటున్నారు. కాగా.. ఈ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఎన్నికల సమయానికి పరిస్థితి ఇంకెలా తయారవుతుందో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.