Political Survey Report in AP: వచ్చే ఎన్నికల్లో ఏపీలో 175 స్థానాలు ఎందుకు గెలవకూడదు? అవును మనం ఎందుకు గెలవలేం? ప్రయత్నిస్తే చంద్రబాబు కుప్పంతో సహ గెలుచుకోలగం… ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, మంత్రులను ఉద్దేశించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలివి. అవే మాటలు పార్టీ ప్లీనరీలో కూడా చెప్పేశారు. అయితే ఈ వ్యాఖ్యలతో వైసీపీని అభిమానించే వారు తెగ సంబరపడిపోయారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమని ఆనందపడుతున్నారు. ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా గెలుపుపై ధీమా వ్యక్తం చేయడం సహజం. కానీ పార్టీలకు అయిగే గెలుపో.. ఓటమే అన్న రెండు ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. కానీ ప్రజలకు మాత్రం పార్టీల రూపంలో ఎన్నో ఆప్షన్లు ఉంటాయి. కానీ బాగా పాలించామన్న ఫీలింగులో ఉన్న ఏపీ సీఎం జగన్ కు వచ్చే ఎన్నికలపై అంత ధీమా ఉండడం కరెక్టే. కానీ వాస్తవ పరిస్థతి ఆయనకు తెలియంది కాదు. ఇప్పటికే ఆయన సర్వేలమీద సర్వేలు తెప్పించుకున్నారు. ప్రజాభిప్రాయం సేకరించి.. ఏయే వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయో ఆరా తీస్తున్నారు. అయితే అసంతృప్తిగా ఉన్న తొలివర్గం మాత్రం సొంత పార్టీ శ్రేణులే అని తెలియడం ఆయనకు షాకిచ్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి తన వెన్నంటి నడిచిన వారే ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారని తెలియడంతో ఆయనలో కలవరం ప్రారంభమైంది. అందుకే ఇప్పుడు ఆయన పార్టీ శ్రేణుల జపం చేయడం ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో మన విజయం పక్కా అని చెబుతూనే.. శ్రేణులకు నేనున్నానంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తరువాత పార్టీ ప్లనరీ సమావేశాన్ని ఏర్పాుటచేసి మరీ వైసీపీ శ్రేణులను కలుసుకోవడం వెనుక సర్వేల ఆంతర్యం ఉందని తెలుస్తోంది.
ముందుగా పార్టీ కేడర్ నుంచే…
వైసీపీ ప్రభుత్వ గ్రౌండ్ రియాలిటీ ఇంత చెత్తగా ఉందా అంటూ జగన్ తెగ బాధపడుతున్నారుట. పట్టుమని రెండేళ్లు కూడా లేవు. ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలి అంటూ ఆయన ఆందోళన చెందుతున్నారుట. సర్వేలు చెబుతున్న సత్యాలు చూసి అంతలా తప్పులు జరిగాయా అని తెగ మదనపడుతున్నారుట. వాస్తవానికి అయిదేళ్లు పాలించే పార్టీకి ప్రజావ్యతిరేకత ఉంటుంది. బ్రహ్మాండంగా పాలించినా -ప్రజలు సంతృప్తి చెందకపోతే ఓటమి తప్పదు. 2014లో విభజన గాయాలతో ఉన్న అవశేష ఆంధ్రప్రదేశ్ కు నిలబడే చోటు కూడా లేకపోయింది. అప్పుల కుప్పలతో ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు పడింది. రెవెన్యూ లోటు, వారసత్వంగా వచ్చిన అప్పులతో ప్రభుత్వం సతమతమైంది. దీనికితోడు కేంద్రం సహాయ నిరాకరణ కూడా ఏపీకి శాపంగా మారింది. అందుకే చంద్రబాబు ఐదేళ్ల పాటు పాలించి.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నంలో పార్టీని పణంగా పెట్టారు. ప్రజలు ఆశించిన స్థాయిలో పాలన సాగించలేకపోయారు. ప్రజలు ఆలోచనలకు తగ్గట్టు తనకు తాను మార్చుకోలేకపోయారు. ఫలితమే 2019 దారుణ ఓటమి. 151 సీట్లతో వైసీపీ ఘన విజయం సాధించింది.
Also Read: Azadi Ka Amrit Mahotsav: జాతీయ జెండాపై ‘మేడిన్ చైనా’ అని రాసుకోవాలా..? మోదీపై ఆగ్రహం
అభివృద్ధిని పక్కనపెట్టి…
అయితే వైసీపీ మాత్రం టీడీపీకి భిన్నంగా వ్యవహరించింది. అభివృద్ధిని పక్కన పడేసి సంక్షేమ తారకమంత్రం అందుకుంది.కానీ ఈ క్రమంలో అనేక తప్పిదాలతో దారుణంగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఐదేళ్ల టీడీపీ పాలనకు వచ్చిన ప్రజా వ్యతిరేకతను మూడేళ్లకే సొంతం చేసుకుంది. ఏ వర్గాలూ సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. చివరకు సొంత పార్టీ వారు సైతం ప్రభుత్వ విధానాలను తప్పుపడుతున్నారు. ప్రభుత్వ చర్యలపై విమర్శలకు దిగుతున్నారు. వైసీపీ ప్రభుత్వ స్వయంకృతపమే ఇందుకు కారణం. అన్నప్రాసన నాడే పిల్లాడికి అవకాయ పెట్టిన చందంగా సంక్షేమ పథకాలను ఇబ్బడిముబ్బడిగా పెట్టారు. అందిన దగ్గర రుణాలు తీసుకుంటున్నారు. భవిష్యత్ ఆదాయాన్ని కుదువపెట్టి మరీ అప్పులు చేస్తున్నారు. వారసత్వంగా వచ్చిన అప్పులు చాలక.. మూడేళ్లో రెట్టింపు అప్పులు చేశారు. నిధులు సమీకరించలేక పన్నులు, చార్జీలను పెంచారు. అటు అప్పులు, ఇటు చార్జీలతో రెండింటికీ చెడ్డ రేవడిగా మారి ప్రభుత్వ చర్యలపై ప్రజలు ఏవగించుకునే స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు పథకాల స్వారీపై దిగలేని దుస్థితి నెలకొంది. ఏమాత్రం కోత విధించినా బాధిత వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. అలాగని కొనసాగిస్తే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
అన్నింటికి సంక్షేమం అంటే కుదరదు..
అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతోంది. ఇంతవరకూ ఒక్క రోడ్డు వేయలేదు. తొలి ఏడాది చంద్రబాబు పాపం అని సర్దిచెప్పుకున్నారు. రెండో ఏడాది కరోనా అని చెప్పడంతో ప్రజలు కాస్తా ఆలోచించారు. మూడో ఏడాది మాత్రం కారణం చెప్పకుండా గడువు ప్రకటించారు. రోడ్లను అద్దంలా మార్చేస్తామని ప్రకటించారు. కానీ నాలుగో ఏడాది పాలనలో అడుగు పెట్టినా రోడ్లు మారలేదు. గుంతల్లో రహదారులను ఎదుర్కొనే స్థితికి ఏపీ ప్రజలు వచ్చేశారు. దీంతో మరింత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. తెర వెనుక నగదు పంచుడు మాట దేవుడెరుగు. అది ఎవరికీ కనిపించదు. ఒక వేళ కనిపించినా అది ప్రజల ధనమే అంటారు. కానీ ఎవరి ఇంటి నుంచి ఇచ్చింది కాదు. కానీ కళ్లెదుట రోడ్లు దారుణంగా తయారవుతుంటే వ్యతిరేకత ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. ప్రజలే బాహటంగా వ్యతిరేకత కనబరుస్తున్న ఘటనలు అన్నిచోట్ల వెలుగుచూస్తున్నాయి. కొందరైతే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో స్వామిజీలు, సినీ ప్రముఖులు సైతం షెటైర్లు వేసే స్థితికి ఏపీ ప్రభుత్వం చేరుకుంది. అంతలా వ్యతిరేకతను మూటగట్టుకుంది.
జెండామోసిన వారిని పక్కన పెట్టి…
ఏ పని చేయాలన్నా, ఏ పనిలో విజయం సాధించినా, ఏ పనిలో ఫెయిలైనా చంద్రబాబును కార్నర్ చేయడం ఆది నుంచి అలవాటు అయిపోయింది. నాడు జన్మభూమి కమిటీలను వ్యతిరేకించి.. అదే స్థాయిలో వలంటీర్లను నియమించారు. ప్రతీ 50 కుటుంబాల బాధ్యతలను అప్పగించారు. పార్టీలో వారినే సుప్రీంగా తీర్చిదిద్దారు.కానీ పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన క్యాడర్ ను పక్కనపెట్టి జీతాలు ఇచ్చి మరీ వలంటీర్లను పెంచి పోషిస్తున్నారు. సహజంగా ఇది నాయకులకు మింగుడుపడడం లేదు. అందుకే గడపగడపకూ మన ప్రభుత్వంలో కూడా స్థానిక నాయకత్వం భాగస్వామ్యం కరువైంది. ఫలితంగా కార్యక్రమమే ఫెయిలైంది. ప్రజల నుంచి నిలదీతలు ఎదురుకావడంతో అట్టర్ ప్లాఫ్ గా మారింది. రూపాయి నిధులు ఇవ్వక ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే నిలదీతలు కాక మరేం వస్తాయని వైసీపీ గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వ చర్యలపై ప్రశ్నిస్తున్నారు. సంక్షేమం తప్ప అభివృద్ధి బాట ఎరుగక పోతే వ్యతిరేకత ఎందుకు రాదు అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం చెబుతున్నట్టు 175 నియోజకవర్గాలకు 175 గెలుపొందుతామని ఆశ పడొచ్చు. సాధించవచ్చు.. కానీ గ్రౌండ్ రియాలిటీని మాత్రం గమనించకపోతే మాత్రం ప్రజలకు విపక్షాలు ప్రత్యామ్నాయంగా ఉన్నాయని గుర్తెరగకపోతే …మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.