Pokiri : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిరస్తాయిగా గుర్తుండిపోయే సినిమాలు కొన్ని ఉన్నాయి, వాటిల్లో ఒక సినిమా గురించి చెప్పమని అడిగితే, మన అందరికి గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు పోకిరి(Pokiri Movie). పూరి జగన్నాథ్(Puri Jagannath), మహేష్ బాబు(Super Star Mahesh Babu) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా, మాస్ కమర్షియల్ సినిమాకు సరికొత్త నిర్వచనం నేర్పించింది. హీరోయిజాన్ని ఇలా కూడా చూపించవచ్చా అని భారత దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ సినిమాని ప్రతీ ఇండస్ట్రీ లో సూపర్ స్టార్స్ రీమేక్ చేసి హిట్ కొట్టారు. కానీ మహేష్ బాబు నటనని కనీసం పావు శాతం కూడా మ్యాచ్ చేయలేకపోయారు. ఈ చిత్రంలో మహేష్ మ్యానరిజమ్స్, స్టైల్, డైలాగ్స్ ప్రతీ ఒక్కటి ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. అయితే ఈ చిత్రాన్ని ముందుగా మహేష్ బాబు తో చేయాలనీ అనుకోలేదట పూరి జగన్నాథ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయాలని అనుకున్నాడట.
ఆయనకు వెళ్లి స్టోరీ ని వినిపించాడట, చేద్దాం అని చెప్పాడు కానీ, మళ్ళీ ఆయన దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మహేష్ బాబు కి వెళ్లి ఈ స్టోరీ ని వినిపించాడట. పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా స్టోరీ ని వినిపించినప్పుడు టైటిల్ ‘ఉత్తమ్ సింగ్’. రాజస్థాన్ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్నాడు. కానీ మహేష్ బాబు వద్దకు వచ్చిన తర్వాత ఉత్తమ్ సింగ్ కాస్త పండుగాడిగా మారిపోయాడు. రాజస్థాన్ బ్యాక్ డ్రాప్ కాస్త, హైదరాబాద్ పాత బస్తీ బ్యాక్ డ్రాప్ గా మారింది. ఇలా కథలో చిన్న చిన్న మార్పులు మహేష్ బాబు సూచించాడట. ఆ మార్పులు చేర్పులు చేసిన తర్వాత పోకిరి చిత్రం సెట్స్ మీదకు వెళ్ళింది. సినిమా విడుదలైన మొదటి వారం లో ఈ చిత్రానికి ఫ్లాప్ టాక్ నడిచింది. కానీ ఆ తర్వాత మాస్ ఆడియన్స్ కి నచ్చడం తో ఎక్కడికో వెళ్ళిపోయింది.
ఆరోజుల్లో 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 36 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, సౌత్ ఇండియా మొత్తం మీద ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది ఆరోజుల్లో ఈ చిత్రం. ఆరోజుల్లోనే ఈ చిత్రానికి 2 కోట్ల 50 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయట. ఇప్పటి ట్రేడ్ లెక్కల ప్రకారం చూస్తే ఇన్ని టికెట్స్ అమ్ముడుపోతే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయి. అదే విధంగా 305 సెంటర్స్ లో 50 రోజులు, 200 సెంటర్స్ లో 100 రోజులు, 63 సెంటర్స్ లో 175 రోజులు, 15 సెంటర్స్ లో 200 రోజులు, 2 సెంటర్స్ లో 300 రోజులు, 2 సెంటర్స్ లో 500 రోజులు, ఒక్క సెంటర్ లో వెయ్యి రోజులు ఆడింది. రీ రిలీజ్ లో కూడా ఈ చిత్రం కోటి 65 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టి సంచలనం సృష్టించింది. అలాంటి సినిమా విడుదలై నేటికీ 19 ఏళ్ళు పూర్తి అయ్యింది.