Pokiri Re- Release: ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడుం, నేను ఎంత ఎదవనో నాకే తెలియదు.., ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా..బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం.. అంటూ పోకిరి సినిమాలో మహేష్ వీర విహారం చేశారు. దర్శకుడు పూరి జగన్నా«థ్ రాసిన ఈ డైలాగ్స్ మహేష్ నోటినుంచి ఓ రేంజ్‌లో తెరపై పేలాయి. అప్పట్లో కాదు.. ఇప్పటికీ ఈ డైలాగ్స్ సూపర్ ఫేమస్. పూరి పోకిరి చిత్రంలో మహేష్ ని సరికొత్తగా ఆవిష్కరించారు. దీనితో అప్పట్లో ఈ చిత్రం పెద్ద సంచలనం. 2006లో విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డ్స్ చెరిపివేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
బర్త్‌డే స్పెషల్‌గా..
స్టార్ హీరోల పుట్టినరోజులు వస్తున్నాయంటే చాలు అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఆగస్టులో పలువురు స్టార్ హీరోల బర్త్‌డేలు వున్నాయ్. అందులో ముందుగా 9వ తేదీన సూపర్ స్టార్ మహేష్‌బాబు బర్త్‌డే ఉంది. బర్త్ డే కానుకగా ఆ రోజు సూపర్ స్టార్ అభిమానులకు సరికొత్త ట్రీట్ ఇవ్వబోతున్నారట. సూపర్ స్టార్ కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్ అయిన ‘పోకిరి’ మూవీని థియేటర్లలో మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారట. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దీనికి సంబంధించి ఓ పెద్ద చర్చ నడుస్తోంది.
రీ రిలీజే కానీ.. సరికొత్తగా..
ఇప్పటికే ‘పోకిరి’ సినిమా రికార్డులు కొల్లగొట్టేసింది. ఈ సినిమాని మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తే, అదీ ఇప్పుడున్న పరిస్థితుల్లో (జనాలు కొత్త సినిమాకే «థియేటర్‌కి రావడం లేదుగా) రీ రిలీజ్ అంటే, ఏ యూజ్ ఉంటుంది అనుకున్న నిర్మాతలు ఫ్యాన్స్‌ని అదో రకమైన మేనియాలోకి నెట్టేసి, క్యాష్ చేసుకోవాలకుంటున్నారట. ఇందు కోసం స్పెషల్ టిక్కెట్టు రేట్లు కూడా పెట్టనున్నారట. అయితే, ‘పోకిరి’ సినిమా టీవీల్లో, ఓటీటీల్లో వుంది. ఇంటర్నెట్‌లోనూ అందుబాటులో వుంది. అలాంటిది, సరికొత్తగా టిక్కెట్టు పెట్టుకుని వెళ్లాలా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు? కానీ, వెర్రి అభిమానం. ఆ అభిమానం ముసుగులో ఎవరి గోల వాళ్లదే. ఏం చేస్తాం. అయితే, నిర్వాహకులు మాత్రం ‘పోకిరి’ సినిమాని యథాతధంగా కాకుండా, టెక్నికల్‌గా కొన్ని మ్యాజిక్కులు, జిమ్మిక్కులు చేయబోతున్నామంటూ ప్రచారం చేస్తున్నారు. అంటే హై టెక్నికల్ వాల్యూస్‌తో థియేటర్‌కి వచ్చిన మహేష్ అభిమానులకు సరికొత్త అనుభూతి కలిగేలా సిద్ధం చేస్తున్నారట. దానికోసం భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారట.