Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఇంత పెద్ద హిట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా కచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఈ సినిమాలోని ప్రతీ పాటకు కొరియోగ్రఫీ చేసింది ఆయనే. చికిరి చికిరి, రయ్ రయ్ రారా వంటి పాటలు నేషనల్ లెవెల్ లో ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాటలకు థియేటర్స్ లో ఆడియన్స్ వేసిన స్టెప్పులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే సినిమా విజయం లో ఇంతటి కీలక పాత్ర పోషించిన జానీ మాస్టర్, ప్రీ రిలీజ్ విడుదల వేడుక కార్యక్రమంలో కానీ, సక్సెస్ ఈవెంట్స్ లో కానీ పాల్గొనకపోవడం గమనార్హం. రామ్ చరణ్ కి ఎంతో సన్నిహితుడైన జానీ మాస్టర్ , ఎందుకు ఈ ఈవెంట్స్ లో పాల్గొనలేదని అభిమానులు సైతం అడుగుతున్నారు.
జానీ మాస్టర్ ని ఆహ్వానిస్తే కచ్చితంగా వచ్చేవారు, కానీ మేకర్స్ అంతటి సాహసం చేయలేకపోయారని తెలుస్తోంది. ఎందుకంటే జానీ మాస్టర్ పై పోక్సో కేసు ఉంది. యంగ్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ ని ఈయన లైంగిక వేధింపులకు గురి చేసారని రెండేళ్ల క్రితం ఈయనపై ఆమె కేసు వేయడం, పోలీసులు కేసు నమోదు చేసి , జానీ మాస్టర్ కోసం గాలించి , బెంగళూరు లోని ఒక రిసార్ట్ లో అరెస్ట్ చేసి దాదాపుగా నెల రోజుల పాటు రిమాండ్ లో ఉంచి విచారించడం, అంతే కాకుండా వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి పోవడం వంటి సంఘటనలు చూసిన తర్వాత జానీ మాస్టర్ కి భవిష్యత్తు ఉంటుందా అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే రామ్ చరణ్ నుండి పిలుపొచ్చింది. దేశం మొత్తం ఊగిపోయే రేంజ్ స్టెప్పులు కంపోజ్ చేసి మరోసారి చరిత్ర సృష్టించారు.
అయినప్పటికి జానీ మాస్టర్ ని పెద్ది ఈవెంట్ కి పిలిస్తే , సినిమాపై లేనిపోనీవు నెగెటివిటీని కొంతమంది అంటిస్తారు , ఆ కారణం చేతనే జానీ మాస్టర్ ని ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన ఈవెంట్స్ కి పిలవడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. అయితే నెగెటివిటీ వస్తుంది అని తెలిసినప్పుడు , జానీ మాస్టర్ ని ఈ సినిమా కోసం తీసుకోకుండా ఉండాల్సింది, ఆయన చేత పాటలను కంపోజ్ చేస్తే రానటువంటి నెగెటివిటీ, ఈవెంట్స్ కి వస్తే వచ్చేస్తుందా?, ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
