Pawan vs Posani: పవన్ కల్యాణ్, పోసాని కృష్ణమురళి మధ్య వార్ ముదురుతోంది. పవన్ వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలపై పోసాని స్పందించారు. జగన్ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. పవన్ పై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోసానిపై దాడికి దిగారు. మాటల యుద్ధం చేశారు.

పవన్ అభిమానుల తీరుతో పోసాని నొచ్చుకున్నారు. మీడియా సమావేశం పెట్టి మరీ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. పవన్ వ్యక్తిగత విషయాలను లేవదీస్తూ బూతు పురాణం వినిపించారు. తన కుటుంబంపై సోషల్ మీడియాలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లోకి కుటుంబాన్ని లాగడం ఏంటని? ప్రశ్నించారు.
పవన్‌పై తాను రాజకీయంగా విమర్శలు చేసినప్పట్నుంచీ ఆయన ఫ్యాన్స్ కొన్నివేల బెదిరింపు ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు చేశారని తెలిపారు. తన భార్యను కించపరిచేలా, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టేలా మెసేజ్‌లు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఆయన కుమార్తెపై కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకు చిరంజీవి కళ్ల నీళ్లు పెట్టుకుని, మనోధైర్యం కోల్పోయారని చెప్పారు. అప్పుడు తానే స్వయంగా కేశినేని నానితో మాట్లాడి మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయకుండా చేశానన్నారు. అప్పుడు ఈ పవన్‌కల్యాణ్, ఆయన ఫ్యాన్స్ ఏమయ్యారని ప్రశ్నించారు. ఆ సమయంలో ‘పోసాని నా గుండెల్లో ఉన్నాడు.. అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. కేసీఆర్ మీద పవన్ ఒక్క వ్యాఖ్య చేస్తేనే ఆయన ఘాటుగా స్పందించారని, అప్పుడు పవన్, ఆయన సైకో ఫ్యాన్స్ నోరు ఎత్తలేదని అన్నారు.
టాలీవుడ్‌లో సినిమా అవకాశాల కోసం వచ్చిన పంజాబ్ యువతిని ప్రముఖ వ్యక్తి ఒకరు మోసం చేశాడని పోసాని వెల్లడించారు. ఈ విషయం బయటపెడితే చంపేస్తానని ఆమెను బెదిరించాడని తెలిపారు. బాధితురాలికి న్యాయం చేస్తే పవన్‌కల్యాణ్‌కు గుడి కడతానని పోసాని మీడియా ముఖంగా ప్రకటించారు. ఇటువంటి ఘటనలు మరికొన్ని టాలీవుడ్ లో జరిగాయని తెలిపారు. వాటిపై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించరని నిలదీశారు.
పోసాని, పవన్ల మాటల యుద్ధం సంగతేమో కానీ.. టాలీవుడ్ లో కొందరు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమను రాజకీయాల్లోకి లాగుతున్నారని పెద్దలు పరోక్షంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పంచాయితీతో పవన్ కు వచ్చిన నష్టమేమో లేదు కానీ.. పోసాని భవిష్యత్తుపై ప్రభావం పడే ప్రమాదముంది సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. వీరిద్దరి వ్యక్తిగత వార్.. టాలీవుడ్ ను చివరికి ఎంతవరకూ తీసుకెళుతుందో?