Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ తన కెరీర్ లోనే మొట్టమొదటిసారి పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అప్పట్లో భారీ అంచనాలు ఉండేవి. కానీ ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనలు జరగడం వల్ల ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడంతో ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పటి వరకు అవ్వలేదు. కానీ నిర్మాత ఏఎంరత్నం అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దాదాపుగా 80 శాతం కి పైగా పూర్తి అయ్యిందని, కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే షూట్ చేయాలనీ, ఆయన డేట్స్ కేవలం 20 రోజులు ఇస్తే సరిపోతుందని చెప్పుకొచ్చాడు. అయితే ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఇటీవలే ఈ సినిమాకి డేట్స్ కేటాయించాడు. ప్రతీ రోజు షూటింగ్ చేస్తూనే ఉన్నాడు.
ఒకపక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూనే, మరోపక్క షూటింగ్ ని కూడా బ్యాలన్స్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. మార్చి 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక సెన్సేషనల్ అప్డేట్ కాసేపటి క్రితమే విడుదలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ మంచి నటుడు మాత్రమే కాదు, గాయకుడు కూడా. ఇది వరకు ఆయన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ‘హరి హర వీరమల్లు’ సినిమాలో కూడా ఆయన ఒక పాట పాడబోతున్నట్టు తెలుస్తుంది. శ్రీకాకుళం యాసలో ఈ పాట ఉంటుందట. పవన్ కళ్యాణ్ కి శ్రీకాకుళం యాసలో పాటలు పాడడం చాలా ఇష్టం. ఇది వరకు ఆయన ఖుషి, జానీ, తమ్ముడు వంటి చిత్రాల్లో పాడాడు.
ఈ సినిమాలో కూడా అలాంటి సందర్భం ఉండడంతో ఆయన ఆ పాట పాడబోతున్నట్టు తెలుస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, చంద్రబోస్ అన్ని పాటలకు సాహిత్యం అందించాడు. ఈ విషయం తెలియగానే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక్కసారిగా ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇది ఇలా ఉండగా ఈ దసరా కానుకగా ఈ చిత్రం నుండి లిరికల్ వీడియో సాంగ్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే సమయం లో ఓజీ నుండి కూడా పాట విడుదల అవుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండిట్లో ఏ మూవీ నుండి ఆరోజు పాట విడుదల అవ్వబోతుంది అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. ఇక ఈ చిత్రంలో నటిస్తున్న నటీనటుల విషయానికి వస్తే నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు సునీల్, జయ్ రామ్, మహేష్ మంజ్రేకర్, అనసూయ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.