Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం ఒక సినిమా హీరో మాత్రమే కాదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ అభిమానులు ఆయన్ని ఇంకా సినిమా హీరోగానే చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడల్లా వేల సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకొని ‘ఓజీ..ఓజీ’ అని అరవడం సర్వసాధారణం అయిపోయింది. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాల్లో చిరాకు పడ్డాడు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాలన్స్ ఉన్న మూడు సినిమాలకు డేట్స్ కేటాయించడానికి ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి గా, పంచాయితీరాజ్, అటవీ శాఖ మంత్రిగా ఆయన క్షణం తీరిక సమయం లేకుండా గడుపుతున్నాడు. 24 గంటలు అధికారులతో చర్చలు జరిపి, ఎదో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతున్నాడు. ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి కేవలం 5 రోజుల కాల్ షీట్స్ ఇస్తే సరిపోతుంది.
కానీ ఓజీ చిత్రానికి ఏకంగా 15 నుండి 20 రోజుల డేట్స్ కావాలి. 5 రోజుల డేట్స్ ఇవ్వడానికే ఇంత ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్, ఇన్ని రోజుల డేట్స్ ఇవ్వడానికి ఇంకెంత ఇబ్బంది పడుతాడో ఊహించుకోవచ్చు. కానీ ఎలాగో ఆ సినిమాలు సగానికి పైగా చేసేశాడు కాబట్టి, తీరిక చూసుకొని చేస్తాడనుకోండి, అయితే ఆయన నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలకు సీక్వెల్స్ కూడా ఉన్నాయి. ఈమధ్య కాలం లో సీక్వెల్స్ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. అవసరం లేకపోయినా క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు సీక్వెల్స్ చేస్తున్నారు. కానీ ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాల కథలకు సీక్వెల్స్ డిమాండ్ ఉంటుంది. ‘హరి హర వీరమల్లు’ కి అయితే క్లైమాక్స్ తర్వాత సీక్వెల్ కి క్లిప్ హ్యాంగర్ గా 8 నిమిషాల సన్నివేశం ఒకటి ఉంటుందట. అదే విధంగా ఓజీ పరిస్థితి కూడా ఇంతే.
రీసెంట్ గానే నిర్మాతలు ఈ రెండు చిత్రాల బ్యాలన్స్ పార్ట్ ని పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ డేట్స్ అడగడానికి వెళ్లారట. ఫిబ్రవరి నుండి షూటింగ్స్ చేస్తానని వాళ్లకు మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్, సీక్వెల్స్ చేసే ఆలోచనని పక్కన పెట్టండి, ప్రస్తుతానికి నా దగ్గర అంతటి సమయం లేదు. ఈ మూడు సినిమాలు చేయడమే చాలా కష్టం అయిపోతుంది అని చెప్పాడట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన అంశం. పవన్ కళ్యాణ్ కి రాబోయే రోజుల్లో హోమ్ మినిస్టర్ పదవి కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న శాఖలతోనే క్షణం తీరిక లేకండా గడుపుతున్న ఆయన, హోమ్ మినిస్టర్ లాంటి బలమైన పదవి వస్తే ఆశలు ఊపిరి తీసుకోవడానికి కూడా సమయం ఉండదని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఆయన సినీ ప్రయాణం ఎలా ఉంటుంది అనేది.