Bheemla nayak: 2022 సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద గట్టి పోటీ నెలకొంది. స్టార్ హీరోలంతా ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రోమో, ట్రైలర్లతో అభిమానుల్లో జోష్ పెంచుతున్నారు. ఇప్పటికే, పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ , సర్కారు వారి పాట, రాధేశ్యామ్ సంక్రాంతి బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించాయి. అయితే, వీరందంరికంటే ముందే రంగంలోకి దిగనున్నారు భీమ్లా నాయక్.
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ నెట్టింట్లో సందడి చేస్తోంది. పవన్ ‘వకీల్ సాబ్’ తరువాత వస్తున్న చిత్రం కావడం వల్ల భీమ్లానాయక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సంక్రాంతికి పాన్ ఇండియా చిత్రాలు కూడా బరిలోకి రావడం వల్ల భీమ్లా నాయక్ వెనక్కి తగ్గనుందని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఈ క్రమంలోనే నిర్మాత నాగవంశీ స్పందించారు. “భీమ్లా నాయక్, డేనియల్ శేఖర్ అల్టిమేట్ క్లాష్ తో జనవరి 12 న బిగ్ స్క్రీన్ వెలిగిపోతుంది” అంటూ ట్వీట్ చేశారు. దీంతో భీమ్లా నాయక్ రిలీజ్ డేట్‌పై వచ్చిన రూమర్స్‌కు చెక్ పెట్టినట్లైంది. దీంతో పవన్, రానా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఓ వైపు ఆనందంగా ఉన్నప్పటికీ.. భారీ చిత్రాల ముందు రీమేక్‌గా తెరకెక్కుతున్న భీమ్లనాయక్ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి వెనక్కి తగ్గని భీమ్లా నాయక్ విజయంలో కూడా ముందుకు దూసుకెళ్తుందో లేదో చూడాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.