Pawan Kalyan and Nitin : తెలుగు సినిమాలో ఇండస్ట్రీ లో యంగ్ హీరో గా మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న నితిన్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద వీరాభిమాని అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నో ఇంటర్వ్యూస్ లో ఆయన ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా తన ప్రతీ సినిమాలోనూ ఎదో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ పేరు ని తీస్తుంటాడు. ఆయన సినిమాల్లోని పాటలను వాడుకోవడం, గెటప్స్ ని రీ క్రియేట్ చేయడం వంటివి చేస్తుంటాడు. ఆయన గత చిత్రం ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ లో కూడా అదే చేసాడు. అంత వీరాభిమాని అయిన నితిన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఎదురు వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులను కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆయన వెంకీ కుడుముల దర్శకత్వం లో ‘రాబిన్ హుడ్’ అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాని గత ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పుష్ప 2 కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఫిబ్రవరి లో విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు కానీ, అనూహ్యంగా ఈ చిత్రాన్ని మార్చి 28 వ తారీఖున విడుదల చేస్తున్నట్టు కాసేపటి క్రితమే మూవీ టీం అధికారిక ప్రకటన చేసింది. ఇదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్న విషయం. ఎందుకంటే అదే రోజున పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదల కాబోతుంది. నితిన్ కి ఈ విషయం తెలియక కాదు, అయినప్పటికీ కూడా అదే తేదీన విడుదల చేయబోతున్నామని ప్రకటించారంటే పవన్ కళ్యాణ్ ఎదురు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నారా? అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ‘హరి హర వీరమల్లు’ కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ చాలా వరకు బ్యాలన్స్ ఉందని, ఆ చిత్ర నిర్మాత రత్నం తో మాట్లాడిన తర్వాతనే ‘రాబిన్ హుడ్’ మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారని అంటున్నారు.
కానీ ‘హరి హర వీరమల్లు’ మూవీ టీం మాత్రం మార్చి 28 న ఈ చిత్రాన్ని అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత మూడు రోజుల నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లో బాబీ డియోల్ మీద పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ వీకెండ్ తో ఆయనకీ సంబంధించిన షూటింగ్ పూర్తి కాబోతుంది. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ కి 8 రోజుల కాల్ షీట్స్ అవసరం ఉంది. ఆయన డేట్స్ ఇస్తే ఫిబ్రవరి నెలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిగా ముగించి, మార్చి 28 న విడుదల చేస్తారు. ఒకవేళ ‘హరి హర వీరమల్లు’ ఆ తేదీన విడుదల అయితే, మార్చి 28 న షెడ్యూల్ చేసిన సినిమాలన్నీ వాయిదా పడుతాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.