పవర్ స్టార్ తో సినిమా తీయాలన్నది తమ కల అని పలువురు నిర్మాతలు, దర్శకులు పలుమార్లు వేదికల మీద చెప్పారు. ఇందులో కొందరు తమ కలను సాకారం చేసుకుంటున్నారు. మరికొందరికి అవకాశం రావట్లేదు. పవన్ రీ-ఎంట్రీ ఇవ్వడంతో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇందులో తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రొడ్యూసర్ బండ్ల గణేష్.
తీన్మార్, గబ్బర్ సింగ్ వంటి చిత్రాల తర్వాత మూడో సినిమా చేయడానికి ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాడు బండ్ల. కానీ.. సమయం కుదరలేదు. ఈ సారి ఎలాగైనా తీసి తీరాలని ట్రై చేస్తున్నాడు. దీనికి పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు గణేష్.
ప్రస్తుతం పవర్ స్టార్.. వీరమల్లు, ఏకే రీమేక్, హరీష్ శంకర్ సినిమాలు చేయాల్సి ఉంది. వీటి తర్వాత గణేష్ సినిమా దాదాపు ఖాయం. అయితే.. ప్రధానమైన సమస్య ఇంకా తీరలేదు. పవన్ ఓకే అన్నాడు.. చెక్ బుక్ తో బండ్ల సిద్ధంగా ఉన్నాడు.. కానీ, దర్శకుడే దొరకట్లేదట. ఈ మాట కూడా బండ్ల బాబే చెప్పాడు.
సరైన దర్శకుడి కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. చాలా మంది అగ్రదర్శకులు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కొందరి సినిమాలు మధ్యలో ఉండగా.. మరికొందరు కరోనా ఎప్పుడు ముగుస్తుందా? ఎప్పుడు మొదలు పెడదామా? అని ఎదురు చూస్తున్నారు. వాళ్లు తమ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని ఫ్రీ అయ్యే నాటికి చాలా సమయం పట్టేట్టు కనిపిస్తోంది.
అందుకే.. సరైన డైరెక్టర్ దొరకట్లేదని అంటున్నాడు బండ్ల. పవన్ సినిమా పూర్తయితే తప్ప.. మిగిలిన ప్రాజెక్టుల జోలికి వెళ్లేది లేదని చెబుతున్నాడు. మరి, ఆ దర్శకుడు ఎప్పుడు దొరుకుతాడో? సినిమా ఎప్పుడు మొదలవుతుందో? అన్నది చూడాలి.