Chiranjeevi Birthday: నేడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం. ఆయన 68వ ఏట అడుగుపెట్టారు. చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, చిత్ర ప్రముఖులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి జన్మదినం పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభిమానులు రక్తదానం క్యాంపులు నిర్వహిస్తున్నారు.
కాగా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నయ్య మీద ప్రేమను తెలియజేస్తూ ఓ లెటర్ హెడ్ విడుదల చేశారు. సదరు లేఖలో చిరంజీవి మీద ఆయనకున్న ప్రేమను కుమ్మరించారు. జనసేన అధినేతగా అన్నయ్య చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. అన్నదమ్ముల అనుబంధాన్ని వారు ప్రత్యేకంగా కొనియాడుతున్నారు.
అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ తమ్ముడుగా పుట్టి మిమ్మల్ని అన్నయ్య అని పిలిచే అదృష్టాన్ని ఇచ్చినందుకు ముందుగా ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతున్నాను. సన్నని వాగు అలా ప్రవహిస్తూ మహానదిగా మారినట్లుగా మీ ప్రయాణం నాకు గోచరిస్తోంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాకుండా లక్షలాదిమందికి స్పూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతి నిజాయతీ, సేవాభావం నా వంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కూడా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌశలంతో సినీ రంగంలో అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరమైన ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో మీరు మరిన్ని విజయాలు చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నయ్య మీద అపరిమిత ప్రేమను చాటుకున్నాడు పవన్ కళ్యాణ్.
కాగా నేడు చిరంజీవి కొత్త చిత్రాలపై ప్రకటన ఉండే అవకాశం కలదు. చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ నిరాశపరిచిన నేపథ్యంలో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఆయన తదుపరి చిత్రానికి ఏ దర్శకుడిని ఎంచుకుంటాడనే ఆసక్తి నెలకొంది. సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో మూవీ దాదాపు ఖాయమైంది. భోళా శంకర్ ఫలితం నేపథ్యంలో సందిగ్ధంలో పడ్డాడనే మాట వినిపిస్తోంది.
అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు – JanaSena Chief Shri @PawanKalyan@KChiruTweets#HBDMegastarChiranjeevi pic.twitter.com/ERu1BHiifr
— JanaSena Party (@JanaSenaParty) August 21, 2023