Paruchuri Gopala Krishna, Sujatha: సినీ రచయిత, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ ( Paruchuri Gopala Krishna) తన ‘పరుచూరి పలుకులు’లో సీనియర్ నటీనటులు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతూ తన సినీ అనుభవాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన అలనాటి నటి సుజాత (Sujatha) గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.
ఆ విషయాలు ఏమిటో పరుచూరి గోపాలకృష్ణ మాటల్లోనే.. ‘సీనియర్ నటి సుజాత గారు గురించి ఏమి చెప్పాలి. ఆమె ఎంత గొప్ప ఆర్టిస్టో మనందరికీ తెలుసు. ఆమెను వెండితెరకు దిగ్గజ దర్శకుడు కె. బాలచందర్ పరిచయం చేశారు. ఆ తర్వాత దాసరి నారాయణ రావు గారు కూడా ఆమెకు మంచి పాత్రలు ఇచ్చి సుజాతగారి స్థాయిని పెంచారు.
అందుకే, సుజాత గారంటే ముందుగా ‘ఏడంతుస్తుల మేడ’ సినిమానే అందరికీ గుర్తొస్తుంది. ఆ తర్వాత కాలంలో ఆమె చేసిన ‘చంటి’ సినిమా కూడా ఆమె కెరీర్ లో గొప్ప సినిమాగా నిలిచిపోయింది. వెంకటేశ్ తల్లి పాత్రలో ఆమె నటన అద్భుతం అనే చెప్పాలి. ఆ రోజుల్లో నాకు బాగా గుర్తు. మా చిత్రాల్లో శారద గారు ఎమోషనల్ పాత్రలు చేస్తే.. దాసరి గారి సినిమాల్లో సుజాత ఎమోషనల్ పాత్రలు చేసేవారు.
అయితే, ఓ సారి సుజాత గారు పరుచూరి దగ్గరకు వచ్చి.. ‘సర్ మీరు పరుచూరి గారని నాకు తెలుసు. అలా కాకుండా మీరు నాకు ఇంకా ఎలాగైనా తెలుసా? మీరు నన్నెప్పుడైనా కలిశారా’ అని అడిగారట. ఆ తర్వాత పరుచూరి మనం ‘మానవుడు మహానీయుడు’ సినిమాకి పనిచేశాము అండి’ అని చెప్పారట. కెమెరా ముందు ఎంతో చలాకీగా ఉండే ఆవిడ బయట మాత్రం ఎందుకో దిగులుగా కనిపించేవారు.