Abraham Ozler Review: రొటీన్ సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడటం లేదు. భిన్నమైన కథ.. ఉత్కంఠ కలిగించే కథనం.. ఆసక్తి కలిగించే సన్నివేశాలు..షాక్ కు గురిచేసే నటీనటుల అభినయాన్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సినిమాలు తీస్తున్నారు కాబట్టే తెలుగు నాట మలయాళ చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. అందుకే మలయాళ సినిమా మేకర్స్ తెలుగు వాళ్లను దృష్టిలో పెట్టుకొని ఉత్కంఠ, ఇతర అంశాల ఆధారంగా సినిమాలు తీస్తున్నారు. అలాంటి కథతోనే అబ్రహం ఓజ్లర్ అనే ఓ సినిమా వచ్చింది. ఇది మలయాళం లో ఇటీవల విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో జయరాం (అల వైకుంఠపురం, గుంటూరు కారం వంటి సినిమాల్లో నటించారు) టైటిల్ రోల్ లో నటించారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో కనిపించారు. రణధీర్ కృష్ణ ఈ సినిమాకు కదా అందించారు. మిథున్ థామస్ దర్శకత్వం వహించారు. జనవరి 11న ఈ సినిమా విడుదలై మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులోనూ డిస్నీ ఈ సినిమాను డబ్ చేసింది.. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..
అబ్రహం (జయరాం) ఒక పోలీసు అధికారి. భార్య, కూతురితో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్తాడు. ఇందుకోసం రెండు రోజుల పాటు సెలవు పెడతాడు. అక్కడ అనుకోకుండా అతడికి ఫోన్ కాల్ వస్తుంది. అత్యవసరం అని చెప్పడంతో భార్య పిల్లలను అక్కడే వదిలేసి అర్ధరాత్రి బయలుదేరుతాడు. కానీ, కొంత దూరం వచ్చిన తర్వాత అతడికి వచ్చింది ఫేక్ కాల్ అని తెలుస్తుంది. వెంటనే వెనక్కి తిరిగి వెళితే తన భార్య, కూతురు కనిపించరు. దీంతో అతడు పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. ఇన్వెస్టిగేషన్లో అబ్రహం కూడా పాలుపంచుకుంటాడు. ఇలా విచారణ చేస్తున్న క్రమంలో వినీత్ (అర్జున్ అశోకన్) అనే కుర్రాడు తన భార్యను, కూతురుని చంపేసినట్టు తెలుస్తుంది. కానీ వారి మృతదేహాలు ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని మాత్రం వివిధ చెప్పడు. ఇలా సంవత్సరాలు గడిచిపోతాయి. భార్య, కూతురి జ్ఞాపకాలతోనే అబ్రహం గడుపుతుంటాడు. నిద్ర పట్టకపోవడంతో అతడికి కొన్ని మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఇది ఇలా ఉండగానే ఒక ఐటీ ఉద్యోగి హత్యకు గురవుతారు. ఆ కేసును చేదించే బాధ్యత అబ్రహం మీద పడుతుంది. అలా ఆ కేశ విచారణ చేస్తుండగానే మరో ముగ్గురు అలాగే చనిపోతారు. దీంతో ఈ వరుస హత్యల కేసును అబ్రహం సవాల్ గా తీసుకుంటాడు. విచారణ చేపడతాడు.. అసలు ఎవరు ఈ హత్యలు చేస్తున్నది? ఎందుకు చేస్తున్నారు? మధ్యలో అలెగ్జాండర్ జోసెఫ్ (మమ్ముట్టి) ఎందుకు వస్తారు? అతడి నేపథ్యమేమిటి? అనేవి తెలుసుకోవాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ సినిమా ప్రారంభ సన్నివేశం నుంచి చివరి వరకు ఉత్కంఠ గానే ఉంటుంది. అసలు విలన్ ఎవరు? ఎందుకు అందర్నీ చంపుతున్నాడు? చంపాల్సిన అవసరం అతడికి ఏమిటి? ఈ ప్రశ్నలు ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను వెంటాడుతాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఈ ప్రశ్నలన్నింటికీ దర్శకుడు చెప్పిన సమాధానం థ్రిల్ కు గురిచేస్తుంది. ఒకానొక సందర్భంలో హంతకుడు దొరికాడనిపిస్తుంది. ఆ తర్వాత అతడు కాదని అర్థమవుతుంది. ఇలా సస్పెన్స్ ను సినిమా చివరిదాకా లాక్కొచ్చిన దర్శకుడి ప్రతిభను అభినందించకుండా ఉండలేం. ముఖ్యంగా స్నేహితుల మధ్య తలెత్తే గొడవలు, అహం, డబ్బు, వ్యసనాల వల్ల జీవితాలు ఎలా మారుతాయి? ముఖ్యంగా పేదవారు ఎలా ప్రభావితం అవుతారు? ప్రేమించిన వాడు తిరిగి రాకపోతే ప్రేమికురాలు తీసుకున్న కఠిన నిర్ణయం.. అది ఇతర ఘటనలకు దారి తీసిన పరిస్థితులు.. ఇలా ఎన్నో కోణాలను దర్శకుడు ఈ చిత్రంలో చూపించాడు.
అబ్రహం గా జయరాం అద్భుతమైన నటన కనబరిచాడు.. భార్య, కూతుర్ని కోల్పోయి.. ఒంటరిగా జీవించే ఒక పోలీస్ అధికారి పాత్రలో మెప్పించాడు. ఎంతో బాధగా ఉన్నప్పటికీ హంతకుడిని పట్టుకునే తీరు ఆకట్టుకుంటుంది. అలెగ్జాండర్ పాత్రలో మమ్ముట్టి అతిధి పాత్రలో కల్పిస్తాడు. సినిమాలో ఉన్నంతసేపు మమ్ముట్టి నడన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అసలు మమ్ముట్టి ఎంట్రీ సీన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. జయరాం, మమ్ముట్టి పాత్రల తర్వాత ఈ సినిమాకు అత్యంత బలమైన పాత్ర ఏదంటే.. వినీత్ అని కచ్చితంగా చెప్పొచ్చు. వినీత్ ఇటీవల అర్జున్ అశోకన్, రోమాంచమ్, భ్రమయుగం అనే సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. సినిమాలోనూ అద్భుతమైన నటన కనబరిచాడు. చివర్లో తన భార్యాబిడ్డలు బతికే ఉన్నారని తెలుసుకున్న అబ్రహం.. వారి జాడను కచ్చితంగా కనుక్కుంటానని వినీత్ కు సవాల్ చేసే సన్నివేశం ద్వారా ఈ సినిమాను ముగించడం దర్శకుడి ప్రతిభకు తార్కాణం. అయితే ఈ సినిమాకు రెండవ పార్ట్ కూడా ఉంటుందని దర్శకుడు ఇచ్చాడు. విలన్ ఎవరో చెప్పకుండా.. చివరి వరకు ఉత్కంఠను కలిగించడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. పాలక్కాడ్, కోయంబత్తూరు, వయానాడ్, త్రిసుర్ వంటి ప్రాంతాలలో ఈ సినిమాను రూపొందించారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
