ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ సినిమా రంగాన్ని అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి దెబ్బకు వరల్డ్‌వైడ్ షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. ఓటీటీల్లో మినహా సినిమా విడుదల నిలిచిపోయింది. డిస్నీల్యాండ్ వంటి ప్రఖ్యాత సంస్థలు సైతం ఉద్యోగులను తొలగించడంతో అనేక మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ ప్రాణాంతక వైరస్ ప్రభావం ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా పండగ… 2021 ఆస్కార్ అవార్డుల వేడుకపై సైతం పడింది. కరోనా కారణంగా ఈ వేడుక రెండు నెలలు వాయిదా పడింది. ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో లేదంటే మార్చి తొలి వారంలో ఆస్కార్ అవార్డ్స్ జరుగుతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న 93వ ఆస్కార్ వేడుకలను నిర్వహించాలని అవార్డు కమిటీ ప్రకటించింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆ ఆలోచన విరమించుకోక తప్పలేదు.
హాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు ఏడాది వరకు రిలీజ్ చేయకుండా రిలీజ్ తేదీలను వాయిదా వేసుకున్నాయి. దీంతో అవార్డుల వేడుకలను నిర్వహించే ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చింది. రెండు నెలలు ఆలస్యంగా అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 25న పురస్కారాల ప్రధానం ఉంటుందని ప్రకటించింది. అంతేకాదు ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడే చిత్రాలఅర్హత తేదీని సైతం ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. అనంతరం మార్చి 15న ఎన్ని నామినేషన్లు వచ్చాయో వెల్లడిస్తామని తెలిపింది.
ఓటీటీ చిత్రాలకు చాన్స్ ఇస్తారా?
ఆస్కార్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి సినిమా నామినేట్ అవ్వాలంటే ఆ సినిమా కచ్చితంగా థియేటర్‌లో రిలీజ్ అయ్యుండాలి. కనీసం వారం రోజుల థియేట్రికల్ రన్ ఉంటేనే ఆ మూవీని ఆస్కార్ కమిటీ ఎంపికకు పరిగణిస్తారు. ప్రస్తుతం కరోనా వల్ల థియేటర్స్ మూతపడ్డాయి. మళ్లీ ఎప్పుడు తెరుస్తారో తెలియదు. ఇలాంటి సమయంలో ఆస్కార్‌కి చిత్రాలను ఎలా ఎంపిక ఎలా చేస్తారు? అనేది ప్రశ్న. అతి భారీ బడ్జెట్ సినిమాలు మినహాయిస్తే.. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేయాలని పలువురు నిర్మాతలు భావిస్తున్నారు. కానీ. అలాంటి చిత్రాలకు ఆస్కార్ కమిటీ అవకాశం ఇస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. థియేటర్లో విడుదల కాకపోయినా ఆస్కార్‌కి ఆస్కారం ఉందని కొంతకాలం కిందట కమిటీ పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని తర్వాత క్లారిటీ ఇచ్చింది. నిబంధనల ప్రకారం కచ్చితంగా థియేటర్‌లో విడుదలైన సినిమాలనే పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. కానీ, ఇప్పుడు వేడుక వాయిదా పడడం.. కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గేలా లేకపోవడంతో నిబంధనలు సడలించే ఆస్కారం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.