Prakash Raj vs Manchu Vishnu: కులం, ప్రాంతీయత విద్వేషాలు రెచ్చ గొట్టి గెలవడం జనరల్ ఎన్నికల్లో చూస్తాం. కానీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో కూడా ప్రాంతీయతే ప్రధానం అవ్వడం విచిత్రమే. నేటి డిజిటల్ జనరేషన్ లో ఓటీటీ సంస్కృతి వచ్చాక, చాలా మారాయి. సినిమాకి భాషతో కూడా పని లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ ఆయన పై వ్యతిరేకత పెరగడం ఇప్పటి సమాజ స్థితికి అద్దం పడుతుంది.

మంచు విష్ణు ‘నాన్ లోకల్’ నినాదాన్ని బాగా ముందుకు తీసుకు వెళ్ళాడు. దీనికి తోడు ప్రకాష్ రాజ్ అతి విశ్వాసం, మితిమీరిన ఆవేశం, అన్నిటికీ మించి జీవిత లాంటి టిపికల్ వ్యక్తి ఆయన ప్యానెల్ లో కీలక వ్యక్తి కావడం.. ఇలా ‘మా’ సంస్థ ఎన్నికల్లో సక్సెస్ రేటు విష్ణు వైపే ఎక్కువ ఉంది. ‘మా’ సంస్థ మన కోసం మనం పెట్టుకున్నాం. మరి మన కోసం పని చేయడానికి మనలో ఒకడు కూడా పనికి రాడా?’ అంటూ రవిబాబు చేత చెప్పించాడు విష్ణు.
రవిబాబు స్పీచే చాలామందికి కనెక్ట్ అయింది. ఇప్పుడు రాజీవ్ కనకాల రూపంలో మరో స్పీచ్ ను వదిలాడు విష్ణు. మా’ ఎన్నికలపై రాజీవ్ కనకాల కీలక వ్యాఖ్యలు చేస్తూ.. ‘మా ఇంటికి ఎవరైనా బంధువు వస్తే కచ్చితంగా అతనికి సకల మర్యాదలు చేస్తాను. చేయిస్తాను. మన ఆచారం ప్రకారం అతనికి అన్ని రకాలుగా ఆతిధ్యాన్ని ఇస్తాము. అయితే, మా ఇంటికి వచ్చి అతను పెద్దరికం తీసుకుంటే.. నేను ఎందుకు ఒప్పుకుంటాను ?’ అంటూ రాజీవ్ కనకాల కామెంట్స్ చేశాడు.
ప్రకాష్ రాజ్ నాన్ లోకల్.. అతనికి మన ఇంటి పెత్తనం ఎలా ఇస్తాం అనే కోణంలో రాజీవ్ మాట్లాడాడు. సినిమా ఇండస్ట్రీలో జనం చాలా సెంటిమెంట్ పీపుల్. ఎప్పటి నుంచో నాన్ లోకల్ వ్యక్తులు తమ అవకాశాలను కాజేస్తున్నారనే కసితో ఉన్నారు చాలామంది నటీనటులు. తెలుగులో చాలామంది మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నా.. వేరే రాష్ట్రాల వాళ్లకే అవకాశాలిస్తున్నారు.
ఈ అంశంలో తెలుగు నటులు చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ మంచు విష్ణు తెలివిగా వేరే నటుల చేత కామెంట్స్ చేయిస్తున్నాడు. దీనికి తోడు ప్రకాష్ రాజ్ బయట నుంచి వచ్చిన వ్యక్తి. అతని వల్ల చాలామంది నటులు తమ అవకాశాలను కోల్పోయారు. ఇప్పుడు దీన్నే ఎజెండాగా మార్చుకున్నాడు విష్ణు.
దాంతో సహజంగానే చిన్న నటీనటుల్లో ప్రకాష్ రాజ్ పై వ్యతిరేఖత పెరుగుతూ ఉంది. ఇక రాజీవ్ కనకాల మంచు విష్ణుకు సపోర్ట్ చేసే స్టార్ హీరోల గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. విష్ణు ‘మా’ బిల్డింగ్ నిర్మాణం, సభ్యుల సంక్షేమం పై పూర్తి స్పష్టతతో ఉన్నాడు. అందుకే మంచు విష్ణుకు ఇప్పటికే బాలకృష్ణ సపోర్ట్ చేశారు. ఇక భవిష్యత్తులో మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ అలాగే ఇతర స్టార్ హీరోలు, మరియు నటీనటులు కూడా సపోర్ట్ చేస్తారు’ అంటూ రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఇదే నిజం అయితే, ప్రకాష్ రాజ్ ఓడిపోవడం ఖాయం.