Ooriki Uttarana: ప్రస్తుతం విభిన్నమైన కాన్సెప్టులతో చిన్న సినిమాలు తెలుగు తెరను పలకరిస్తున్నాయి. అలా సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘ఊరికి ఉత్తరాన’. టైటిలే డిఫరెంట్‌గా ఉండడం, అలానే సినిమా విడుదలైన ట్రైలర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ‘ఊరికి ఉత్తరాన’పై అంచనాలు పెరిగాయి. సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నరేన్ వనపర్తి, దీపాళ్లీ శర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. అలానే ఆనంద చక్రపాణి, రామరాజు, అంకిత్ కొయ్య, జగదీష్, ఫణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మూడు దశాబ్దాల క్రితం ఓ గ్రామంలో జరిగిన ప్రేమ వివాహం యువకుడి హత్య నేపధ్యంలో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తుంది.

ఈనెల 19న విడుదలైన సినిమా విజయోత్సవ యాత్రలో భాగంగా సినిమా యూనిట్ వరంగల్‌కు వచ్చింది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హీరో నరేన్. ప్రసుత్త సమాజంలో కొందరు కులపిచ్చితో పరువు హత్యలకు పాల్పడుతుంటే… సినిమా పరిశ్రమ లోనూ కొత్త నటులపై వివక్ష కొనసాగుతోందని అన్నాడు. ఈ క్రమంలో పొలం అమ్ముకొని తీసిన సినిమా విడుదలకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బు, బ్యాక్‌గ్రౌండ్ ఉంటేనే ఫిలిం ఇండస్ట్రీలో స్థానం ఉంటుందనే భావన కలిగేలా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు నరేన్. సినిమా షూటింగ్ ఎక్కువ శాతం వరంగల్‌లోని పర్వతగిరి మండలం వడ్లకొండ గడీ, ఖిలావరంగల్, హైదరాబాద్ ప్రాంతాల్లో తీశామన్నాడు. సినిమా విడుదలకు ఒక్క డిస్ట్రిబ్యూటర్ ముందుకు రాలేదని తప్పనిసరి పరిస్థితుల్లో మరో రూ.60 లక్షల తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 100 థియేటర్లలో స్వతహాగా విడుదల చేశాం అన్నాడు.
వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం, రేబల్లె గ్రామానికి చెందిన వనపర్తి కొమురమ్మ, వెంకటయ్య దంపతుల కుమారుడు నరేన్. హనుమ కొండలో డిగ్రీ పూర్తి చేశాక, ఎంసీఏ కోసం 2003లో హైదరాబాద్ వెళ్లి కృష్ణా నగర్‌లో అద్దెకు ఉంటూ చదువుతూ అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగే వాడినని అన్నారు. ఎలాగైనా సినిమా తీయాలన్న నా కోరికతో ఊరిలో ఉన్న మూడెకరాల పొలం, రెండు ప్లాట్లు అమ్ముకొని జబర్తస్త్ ఫణీ, ఉదయ్‌తో కలిసి నాన్న వెంకటయ్య గణేష్‌రెడ్డి బీవీఎం నిర్మాతలుగా ఊరికి ఉత్తరాన సినిమా రూపొందించినట్లు తెలిపారు.