
ఏపీ ప్రభుత్వంతో టికెట్ రేట్ల విషయం చర్చించేందుకు ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి తాజాగా తన ఇంట్లో హీరోలు, నిర్మాతలు, దర్శకులతో కలిసి కీలకసమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల గురించి చిరంజీవి, ఇండస్ట్రీ పెద్దలు చర్చించారు.ఏపీలో పరిస్థితులు, నిబంధనల కారణంగా మీడియం రేంజ్, పెద్ద సినిమాల విడుదలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. టికెట్ రేట్ల తగ్గింపు ఉండటం.. మూడు షోలకు మాత్రమే అనుమతి ఉండడంపై ప్రధానంగా చర్చించారు.
ఈ సమస్యలన్నింటిని ఏపీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ సమాలోచనలు జరిపారు. మెగాస్టార్ చిరంజీవి మరో ఇద్దరితో భేటి అయ్యేందుకు జగన్ సానుకూలంగా స్పందించి రావాలని కోరారు. ఈ మేరకు ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల్లో దేని గురించి ఎక్కువగా చర్చించాలనే విషయాన్ని పెద్దలంతా కలిసి చిరంజీవి ఇంట్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని చర్చించారు.
చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ కీలక సమావేశంలో నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, వినాయక్, ఆర్. నారాయణ మూర్తి లాంటి పెద్దలు పాల్గొన్నారు.ఈ ఫొటోలను బాగానే వైరల్ చేశారు. అయితే ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ ఎమ్మెల్యే అయిన బాలక్రిష్ణ లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
బాలక్రిష్ణను ఈ మీటింగ్ కు పిలవలేదా? లేక బాలయ్యనే వెళ్లలేదా? అన్నది తెలియాల్సి ఉంది. గతంలోకూడా తనను కావాలనే మీటింగ్ లకు దూరం పెడుతున్నారని బాలయ్య బహిరంగంగానే మీడియా ముఖంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో రియల్ ఎస్టేట్ బిజినెస్ జరుపుతున్నారా? అని తీవ్ర విమర్శలు చేశారు. ఆ మాటలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. పెద్ద దుమారం రేపాయి. చిరంజీవి సహా ఎవరూ బాలయ్య మాటలపై స్పందించలేదు. ఇప్పుడు మళ్లీ బాలయ్య స్పందిస్తారో అన్నది వేచిచూడాలి.