బుల్లితెర యాంకర్ ఓంకార్, వెండితెర దర్శకుడిగా మారి తీసిన ‘రాజుగారి గది’ ఏదో పర్వాలేదనే టాక్ తో, బిలౌవ్ ఏవరేజ్ అనిపించుకుంది. ఇక అప్పటి నుండి ఇప్పటివరకు ఓంకార్, ఆ రాజుగారి గదిలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ‘రాజుగారి గది’ 1,2,3 అంటూ పక్కన నెంబర్లు యాడ్ చేస్తూ.. అప్పుడెప్పుడో వచ్చిన ఆ చిన్నపాటి హిట్ ను ఇంకా క్యాష్ చేసుకోవాలని తెగ ఉబలాట పడుతున్నాడు.
అసలు తన తమ్ముడు అశ్విన్, హీరోయిన్ అవికా గోర్ ప్రధాన పాత్రల్లో ‘రాజు గారి గది 3’ సినిమాని తీసి భారీ డిజాస్టర్ ఇచ్చాడు. ఈ సినిమా పై ప్రేక్షకుల విరుచుకుపడ్డారు. ఇది కూడా ఒక సినిమానేనా ? అంటూ రెచ్చిపోయి ఓంకార్ పరువును తీశారు. చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు.. ఓంకార్ మళ్ళీ తన దగ్గర ‘రాజు గారి గది 4’ కథ సిద్ధంగా ఉందంటున్నాడు.
కాగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓంకార్ మాట్లాడుతూ.. ‘అవును, బయట వస్తోన్న రూమర్స్ లో నిజం ఉంది. రాజు గారి గది 4’ స్క్రిప్ట్ రెడీ అయింది. అయితే, టైటిల్ చూసి మిస్ లీడ్ అవ్వొద్దు. గతంలోని రాజుగారి గది చిత్రాలకు, ఇప్పుడు తీయబోయే చిత్రానికి చాల తేడా ఉంటుంది. అలాగే నేను ఈ కరోనా కాలంలో ఎక్కువగా కథల పై కూర్చున్నాను.
ఆల్ రెడీ, థ్రిల్లర్, స్పోర్ట్స్, గ్రామీణ నేపథ్యంలో డిఫరెంట్ డిఫరెంట్ కథలు రాసుకున్నాను. త్వరలోనే ఆ కథలకు సూట్ అయ్యే హీరోలను ఒప్పించి, సినిమాని స్టార్ట్ చేస్తాను అంటూ ఓంకార్ కొత్త కబుర్లు చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా రాజుగారి గది ఫ్రాంచైజీలో సినిమాలను ఇప్పట్లో ఓంకార్ ఆపేలా లేడు. నిజానికి ఓంకార్ కెరీర్ లో ఏకైక హిట్ రాజుగారి గది. అందుకే ఆయన పేరు మీదే సినిమా చేయడానికి తాపత్రయపడుతున్నారు. మరి ఇంకా ఎన్నేళ్లు ఈ ‘రాజుగారి గది’లో ?