JrNTR about Hrithik Roshan: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన ‘వార్ 2’ మరో మూడు రోజుల్లో రాబోతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మాట్లాడిన మాటలకు అభిమానులు మెంటలెక్కిపోయారు. ప్రతీ ఈవెంట్ లో ఎన్టీఆర్ అభిమానులను కాలర్ ఎగరేసుకునేలా చేస్తానని చెప్తుంటాడు. కానీ ఈ ఈవెంట్ లో ఆయన తన కాలర్స్ ని ఎగురవేయడం హైలైట్ గా మారింది. హృతిక్ రోషన్ ని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడిన మాటలు, అదే విధంగా అభిమానులను ఉద్దేశిస్తూ ఆయన ఇచ్చిన ప్రసంగం ఎన్టీఆర్ అభిమానులు జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ఉన్నాయి.
ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘హృతిక్ రోషన్ గారు ఈ దేశం లోనే అద్భుతమైన నటుడు. ఇంతమంది మధ్య సభాముఖంగా చెప్తున్నాను, ఈ దేశం లోనే ది బెస్ట్ డ్యాన్సర్ హృతిక్ రోషన్ గారు మాత్రమే’ అని అంటాడు. అప్పుడు హృతిక్ రోషన్ ‘నేను కాదు’ అంటూ చేతులు ఊపడం ఈవెంట్ లో హైలైట్ గా మారింది. ఇంకా హృతిక్ రోషన్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘ఆయన్ని నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఒక ఆదర్శంగా తీసుకునే వాడిని. ఆయన డ్యాన్స్ ని, యాక్టింగ్ ని విపరీతంగా ఇష్టపడేవాడిని. అలాంటి సూపర్ స్టార్ తో నేడు కలిసి సినిమా చేయడం నా అదృష్టం గా భావిస్తున్నాను. 75 రోజులు ఆయన తో కలిసి పని చేయడం నా జీవితం లో ఎప్పుడూ మర్చిపోలేను. మళ్ళీ ఆయనతో కలిసి నటించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను. నేను సెట్స్ లోకి అడుగుపెట్టిన రోజున ఆయన నన్ను హత్తుకున్న తీరుని ఇప్పటికీ మర్చిపోలేదు. ఆయన నాపై చూపించిన ప్రేమ, ఎనలేనిది. ఆయన నుండి నేను ఎన్నో అద్భుతమైన విషయాలను నేర్చుకున్నాను. ఈ సినిమా నుండి మొన్ననే మేమిద్దరం కలిసి చేసిన పాటకు సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమో లో సోషల్ మీడియా లో అందరూ నాకు హృతిక్ కి మధ్య పోటీ అని అనుకుంటున్నారు. కానీ కాదు, ఒక ఇద్దరు డ్యాన్సర్లు ఒకరిని ఒకరు మెచ్చుకుంటూ చేస్తే ఎలా ఉంటుందో, అలా ఉంటుంది ఈ పాట. నేను ఈ చిత్రం తో బాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్నాను, అదే విధంగా హృతిక్ రోషన్ గారు కూడా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అవుతున్నాడు. ఇక్కడికి వచ్చిన నా అభిమానులంతా ఇక నుండి మీ అభిమానులు కూడా సార్. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘నా జీవితం లో ప్రారంభం నుండి ఇప్పటి వరకు , ఒకే తల్లి కడుపునా పుట్టకపోయిన కూడా,నా కష్టసుఖాల్లో తోడు ఉంటూ, నాతో పాటు నవ్వుతూ, నేను బాధల్లో ఉన్నప్పుడు నా కోసం ఏడ్చిన ఇంతమంది అభిమానులు దొరకడం నేను పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టం గా భావిస్తున్నాను. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండేందుకే నేను ప్రయత్నాలు చేస్తాను, మిమ్మల్ని బాధ పెట్టే పనులు,మీరు తలదించుకునే పనులు ఎప్పటికీ చేయను’ అంటూ ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతాడు.