Pooja Hegde: పూజా హెగ్డే కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కాలికి కట్టు చుట్టుకొని ఉన్న పూజా హెగ్డే వీడియో వైరల్ అవుతుంది. స్టార్ హీరోయిన్ పూజాకు క్షణం తీరిక ఉండదు. షూటింగ్స్, మీటింగ్స్ అంటూ రోజూ పలు షెడ్యూల్స్ ఉంటాయి. అనుకున్న డేట్ కి సమయానికి ఒప్పుకున్న పని పూర్తి చేయాలి. లేదంటే అంతా తేడా కొట్టేస్తుంది. పూజా హెగ్డే కాలికి గాయంతో కూడా షూట్ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు. పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియోలో ఆమె మేకప్ మిర్రర్ ముందు కూర్చొని ఉన్నారు. కాలికి గాయం కనిపిస్తుంది.

ఏదైనా కానీ పని చేసుకుంటూ పోవాల్సిందే అని సదరు వీడియోకి పూజా కామెంట్ రూపంలో వివరణ ఇచ్చారు. దీంతో పూజ హెగ్డే ప్రమాదం బారినపడ్డారని అర్థమైంది. మరి అది ఏపాటి గాయం అనేది క్లారిటీ లేదు. వీడియో చూసిన ఆమె ఫ్యాన్స్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూజా కాలికి ఏమైంది అంటూ వాకబు చేస్తున్నారు. అదే సమయంలో పూజా హెగ్డే కమిట్మెంట్ కి మెచ్చుకుంటున్నారు.
ప్రస్తుతం పూజా చేతిలో మూడు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మహేష్-త్రివిక్రమ్ ల మూవీ ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. ఫస్ట్ షెడ్యూల్ మొదలు కాగా సెకండ్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. మహేష్ 28వ చిత్రంగా తెరకెక్కుతుండగా త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ మూవీ. దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో ప్లాప్స్ లో ఉన్న పూజాకి ఇది కమ్ బ్యాక్ చిత్రం అవుతుందని భావిస్తున్నారు. పూజా రోల్ సైతం త్రివిక్రమ్ సరికొత్తగా రూపొందించారట. త్రివిక్రమ్ తో పూజా హెగ్డేకు ఇది వరుసగా మూడో చిత్రం.

అలాగే సల్మాన్ కి జంటగా కిసీ కి భాయ్ కిసీ కా జాన్ మూవీలో నటిస్తున్నారు. 2023 రంజాన్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. ఫర్హాద్ సామ్జీ దర్శకుడు. ఇక రణ్వీర్ సింగ్ కి జంటగా చేస్తున్న మరో బాలీవుడ్ చిత్ర షూటింగ్ జరుపుకుంటుంది. రోహిత్ శెట్టి ఈ చిత్ర దర్శకుడు కావడం విశేషం. పూజా కాలికి గాయమైన నేపథ్యంలో సల్మాన్, రణ్వీర్, మహేష్ చిత్రాలపై ప్రభావం చూపే సూచనలు కలవు. ఈ మూడు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఒకవేళ పూజా షూటింగ్ లో పాల్గొనకపోతే షెడ్యూల్స్ డిస్టర్బ్ అయ్యే ఆస్కారం కలదు. ఈ క్రమంలో మేకర్స్ ని కూడా పూజా హెగ్డే పోస్ట్ కలవర పెడుతుంది.
తెలుగులో వరుస విజయాలు నమోదు చేసి గోల్డెన్ లెగ్ ఇమేజ్ తెచ్చుకున్న పూజాకు షాక్ ఇస్తూ మూడు వరుస ప్లాప్స్ పడ్డాయి. ఆమె హీరోయిన్ గా నటించిన ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్ దారుణ పరాజయం చవిచూశాయి. పూజా ఇమేజ్ ఒక్కసారిగా తలక్రిందులు అయ్యింది.