
Box Office Collection: ఆంధ్రలో సినిమా టికెట్ రేట్లు బాగోతం ఏమైంది ? ప్రస్తుతం ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యల్లో ఈ టికెట్ రేట్ వ్యవహారమే అతి పెద్ద సమస్య. సింగిల్ స్క్రీన్ లు అన్నింటిలో టికెట్ రేట్ల పై ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. దీనికి తోడు ఎన్ని ఆటలు వేసుకోవాలి ? అదనపు షోల పరిస్థితి ఏమిటీ ? లాంటి విషయాలు ఆంధ్రలో క్లారిటీ లేదు. టికెట్ రేట్లు పెంచకపోతే.. పెద్ద సినిమాలు పూర్తిగా నష్టపోతాయి. టికెట్ రేట్ల విషయంలో కూడా జగన్ సానుకూలంగా లేరని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
మరోపక్క ప్రజలను దోచుకోకుండా చూడాలన్నదే మా నాయకుడు ముఖ్య ఉద్దేశ్యం అంటూ ఏపీ మంత్రులు చెప్పుకొస్తున్నారు. ఇదే నిజం అయితే.. టికెట్ రేట్లు ఇప్పట్లో తెగడం కష్టమే. అయితే, కొన్నాళ్ల క్రితం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన టికెట్ ల జీవో కు సవరణ జీవో వస్తుందని అంటున్నారు. కానీ ఆ జీవో ఎప్పుడు వస్తోందో తెలియడం లేదు.
నిజానికి పెద్ద సినిమాల కలెక్షన్స్ వందల కోట్ల మార్క్ ను అందుకుంటేనే గిట్టుబాటు అవుతుంది. కానీ ఆ మార్క్ ను అందుకోవాలి అంటే.. మొదటి రెండు రోజుల షోల టికెట్లును భారీ రేట్లకు అమ్ముకోవాలి. అప్పుడే భారీ కలెక్షన్స్ వస్తాయి. లేదు అంటే అసలుకే మోసం వస్తోంది. అందుకే.. సినీ పెద్దలు, పెద్ద హీరోలు ఏమి చేయాలో తెలియక, తమ సినిమాల విడుదల తేదీలను మార్చుకుంటూ పోతున్నారు.
ఆంధ్రలో ‘బి’ సెంటర్ల నుంచే ఎక్కువ వసూళ్లు వస్తాయి. అయితే, ఆ సెంటర్స్ లోనే రేట్లు పెంచడానికి ప్రభుత్వం అంగీకరించట్లేదు. అసలు బి సెంటర్లే ఆంధ్రలో ఎక్కువ అనే విషయం తెలిసే.. జగన్ ఆ సెంటర్స్ పై కఠినంగా వ్యవహరిస్తున్నాడనే రూమర్ కూడా ఉంది. అందుకే, జగన్ ఫ్రభుత్వం ‘ఎ’ సెంటర్స్ విషయంలో సినీ పెద్దల ఇష్టానికి వదిలేసి, బి సెంటర్ల విషయంలో మాత్రం ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ముందుకుపోవాలని నిర్ణయించారట.
ఒకవేళ ఇదే నిజం అయితే, ఇక పెద్ద సినిమాలు భారీ కలెక్షన్స్ ను మర్చిపోవడమే. సినీ పెద్దలు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఎ సెంటర్స్ విషయంలో పెద్దలు ఇష్టప్రకారమే చేశాము, బి సెంటర్స్ లో మాత్రం నియమాల ప్రకారమే ముందుకు పోదామని ప్రభుత్వ పెద్దలు చెబితే.. ఎదురు ఏమి చెప్పలేం. మరి ఈ టికెట్ల రేట్లు ఇంకెన్నాళ్లు హాట్ టాపిక్ అవుతాయో చూడాలి.