Prathinidhi 2: హీరో నారా రోహిత్ దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత మూవీ ప్రకటించారు. ప్రతినిధి 2 టైటిల్ తో తెరకెక్కే పొలిటికల్ డ్రామాకు టీవీ5 మూర్తి దర్శకుడు కావడం ఇక్కడ విశేషత సంతరించుకుంది. టీవీ5 మూర్తికి తెలుగు రాష్ట్రాల్లో ఓ ఇమేజ్ ఉంది. ఆయన టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధి. ఆ పార్టీ కోసం పని చేస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి. సీఎం జగన్ అయితే తన ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేసే ఛానల్స్ లో టీవీ5 ఒకటని బహిరంగంగా చెబుతారు. ఇక నారా రోహిత్ టీడీపీ నేత.
ఆ పార్టీ కార్యక్రమాల్లో ఆయన నేరుగా పాల్గొంటారు. టీడీపీకి మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్స్ చేస్తున్నారు. తెలుగుదేశం సానుభూతిపరులు కలిసి చేస్తున్న ప్రతినిధి 2 ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వాన్ని ఎండగట్టే సినిమానే అని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పొలిటికల్ గా కూడా ఇది హీట్ రగిలిస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… ఇది టీవీ5 మూర్తి బయోపిక్ అంటున్నారు. ఆయన కథనే నారా రోహిత్ హీరోగా తెరకెక్కిస్తున్నారట.
ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాలకమండలి నియామకాల విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ టీవీ5 గతంలో ఒక కథనం ప్రసారం చేసింది. దీనికి సంబంధించి ఓ రిపోర్ట్ స్క్రీన్ పై ప్రదర్శించారు. ప్రభుత్వ సమాచారాన్ని దొంగిలించారు. బహిరంగంగా ప్రదర్శించారని టీవీ5 మూర్తి మీద కేసు పెట్టారు. ఆయన్ని ఏపీ సిఐడీ ప్రశ్నించడం జరిగింది. ఏపీ ప్రభుత్వం తనను వేధిస్తోందని మూర్తి ఆరోపణలు చేశాడు.
మీడియా మీద ప్రభుత్వ ఆంక్షలు అన్న కోణంలో తన కథనే సినిమాటిక్ గా రాసి ప్రతినిధి 2గా తెరకెక్కిస్తున్నారని వినికిడి. ఏపీ ప్రభుత్వం మీద ఘాటైన విమర్శలు, డైలాగ్స్ ఉంటాయని. ఈ మేరకు సన్నివేశాలు కూడా రాసుకున్నారని అంటున్నారు. ఈ ప్రచారం ఏ మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. మొత్తంగా ప్రతినిధి 2 ప్రకటన అటు రాజకీయ ఇటు సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.