Nandamuri Balakrishna: తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలకృష్ణ కి ఉన్నటువంటి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ వయస్సులో కూడా ఆయన నేటి తరం స్టార్ హీరోలతో పోటీ పడుతూ ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పుతున్నాడు. ముఖ్యంగా ‘అఖండ’ చిత్రం నుండి బాలయ్య సరికొత్త వెర్షన్ ని యూత్, మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆయన సినిమాలకు వస్తున్న వసూళ్లు అందుకు ఉదాహరణ. అయితే బాలయ్య క్రేజ్ కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయ్యింది అనుకుంటే పొరపాటే. ఆయన సినిమాలను నార్త్ ఇండియన్స్ కూడా తెగ చూసేస్తున్నారు అనడానికి మహాకుంభమేళ లో కనపడిన ఒక దృశ్యం నిదర్శనం అని చెప్పొచ్చు. ఈ కుంభమేళాకు దేశం నలుమూలల నుండి భక్తులు చేరుకొని పుణ్య స్నానాలు ఆచరిస్తున్న సంగతి తేలిసిందే. వివిధ ప్రైవేట్ బస్సులు, కార్లు, ట్రైన్ల ద్వారా కోట్లాది మంది ప్రజలు చేరుకుంటున్నారు.
అయితే వెస్ట్ బెంగాల్ నుండి కొంతమంది భక్తులు ఒక స్పెషల్ బస్సు ని బుక్ చేసుకొని రావడం, ఆ బస్సు మొత్తాన్ని బాలయ్య బాబు పెయింటింగ్స్ తో నింపేయడం, దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య కి నార్త్ ఇండియా లో ఇంతటి వీరాభిమానులు ఉన్నారా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వెర్రి అభిమానాన్ని ఇప్పటి వరకు చూడలేదు, అలాంటిది ఎక్కడో వెస్ట్ బెంగాల్ ఇలాంటి అభిమానం చూపించారంటే బాలయ్య బాబు కి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలయ్య బాబు ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఎలాంటి పాన్ ఇండియన్ సినిమా చేయలేదు. ఆయన నటించిన అఖండ చిత్రం విడుదలైన చాలా రోజుల తర్వాత హిందీ లో డబ్ చేసి విడుదల చేసారు కానీ పబ్లిసిటీ చేయకపోవడం వల్ల సరిగా ఆడలేదు.
కానీ ఇదే అఖండ చిత్రాన్ని హాట్ స్టార్ లో అప్లోడ్ చేసినప్పుడు హిందీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎగబడి చూశారట. బాలయ్య మాస్ విశ్వరూపాన్ని చూసి వాళ్లంతా షాక్ కి గురయ్యారట. కేవలం ఓటీటీ లోనే కాదు, అక్కడ టీవీ టెలికాస్ట్ లో కూడా ఈ చిత్రాన్ని రికార్డు స్థాయిలో చూశారట. ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా ఆ రేంజ్ లో రీచ్ వచ్చింది కాబట్టే, బాలయ్య కి వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో అంతటి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం బాలయ్య ‘అఖండ 2 ‘ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడలో కూడా విడుదల చేస్తామని అంటున్నారు. చూడాలి మరి ఈ చిత్రం తో బాలయ్య పాన్ ఇండియా లెవెల్లో ఎలా తాండవం ఆడుతాడో అనేది.