Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన వ్యవహారంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పెద్ద రిలీఫ్ దక్కింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా, నేడు విచారించిన కోర్టు అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. గడిచిన నెల రోజుల నుండి అల్లు అర్జున్ ‘పుష్ప 2 ‘ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేక, పోలీస్ స్టేషన్ మరియు కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన అభిమానులకు ఒక పక్క జరిగిన దుర్ఘటన కి బాధ పడాలా? లేదా తమ అభిమాన హీరో ని దోషిని చేసి అరెస్ట్ చేసారు అని బాధపడాలో అర్థంకాక ఎంతో మానసిక వేదనకు గురయ్యారు. మధ్యలో మీడియా లో అల్లు అర్జున్ బెయిల్ రద్దు అవ్వబోతుందని, అరెస్ట్ కాబోతున్నాడని వార్తలు వచ్చాయి.
ఈ వార్తలను చూసి అభిమానులు ఎంతో కంగారు పడ్డారు. మొత్తానికి ఎలాంటి అనర్ధం జరగకుండానే అల్లు అర్జున్ కి చాలా సేఫ్ గా రెగ్యులర్ బెయిల్ వచ్చింది. దీంతో ఆయన ఎప్పటి లాగానే సినిమా షూటింగ్స్ లో పాల్గొనడానికి సిద్ధం అవ్వొచ్చు. మరోపక్క శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా వరకు మెరుగు పడింది. అతి త్వరలోనే ఆ కుర్రాడు పూర్తి స్థాయిలో కోలుకునే అవకాశాలు ఉన్నాయి. మరి అతన్ని అల్లు అర్జున్ ఎప్పుడు కలవబోతున్నాడు అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అతన్ని కలిసిన రోజు మరోసారి నేషనల్ లెవెల్ లో అల్లు అర్జున్ పేరు మారు మోగిపోనుంది. ఇప్పటికే ఆ కుర్రాడి కుటుంబానికి పుష్ప రెండు కోట్ల రూపాయిల ఆర్ధిక సాయం తో పాటు భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామంటూ మాట ఇచ్చారు. అంతే కాకుండా నిర్మాత దిల్ రాజు శ్రీ తేజ్ తండ్రి భార్గవ్ కి సినీ ఇండస్ట్రీ లో మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పుకొచ్చాడు.
ఆ కుర్రాడికి సినీ ఇండస్ట్రీ అండగా నిల్చిన తీరుకి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇకపోతే అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల నుండే ప్రారంభించాలని అనుకున్నారు కానీ, అల్లు అర్జున్ ఈ కోర్టు సమస్యల్లో చిక్కుకోవడం వల్ల తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ సరికొత్త లుక్ లోకి రానున్నాడు. ఈ చిత్రం కోసం ఆయన గుబురు గడ్డం, పొడవాటి జుట్టు పెంచనున్నాడు. సుమారుగా 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. హిస్టారికల్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మన తెలుగు ఆడియన్స్ లోనే కాకుండా, హిందీ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ‘పుష్ప’ సిరీస్ రేంజ్ లో మరోసారి అల్లు అర్జున్ అలరిస్తాడో లేదో చూడాలి.