Akkineni Nagarjuna : ఆరు పదుల వయస్సు దాటిన సీనియర్ హీరోలు, ఇప్పటి తరం స్టార్ హీరోలకంటే మంచి ఊపు మీదున్నారు. రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు సార్లు వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకున్నాడు. ఇక గత రెండు దశాబ్దాలుగా ఒకటి రెండు హిట్లు తప్ప, ఫ్లాపులతో ఎక్కువ సావాసం చేసిన నందమూరి బాలకృష్ణ, ‘అఖండ’ చిత్రం నుండి ఏ రేంజ్ ఫామ్ లో ఉన్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. వరుసగా నాలుగు సూపర్ హిట్ సినిమాలు తీసి కుర్ర హీరోలకు పోటీగా మారిపోయాడు. కానీ ఇప్పటి వరకు ఆయనకీ వంద కోట్ల షేర్ వసూళ్లను రాబట్టిన సినిమా రాలేదు. ‘అఖండ 2’ తో ఆ ప్రెస్టీజియస్ క్లబ్ లోకి ఎలాగో చేరిపోతాడు అనుకోండి అది వేరే విషయం. రెండు దశాబ్దాలుగా సోలో హీరోగా హిట్స్ లేని విక్టరీ వెంకటేష్ కూడా రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాడు.
ఈ సీనియర్ హీరోల అభిమానులు తమ హీరోలు ఉన్న పీక్ ఫామ్ ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అక్కినేని నాగార్జున పరిస్థితే ఆయన అభిమానులకు ఫ్రస్ట్రేషన్ తెప్పించే విధంగా ఉంది. ఈయన నుండి విడుదలైన చిత్రాల్లో పూర్తి స్థాయి కమర్షియల్ సక్సెస్ అయిన చిత్రం ‘ఊపిరి’. 2016 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా తర్వాత నాగార్జున కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ పడకపోగా, ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా పడ్డాయి. వాటికి కనీసం కోటి రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాకపోవడం దురదృష్టకరం. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘నా సామి రంగ’ చిత్రం మాత్రమే పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది. పోనీ భవిష్యత్తులో అయినా పెద్ద హిట్ కొడతాడా అంటే, ఇక మీదట ఆయన లీడ్ రోల్స్ చేస్తాడా అనే అనుమానం కలిగించాడు అభిమానులకు.
ప్రస్తుతం ఆయన చేతిలో ‘కూలీ’, ‘కుభేర’ వంటి చిత్రాలు ఉన్నాయి. ‘కూలీ’ చిత్రంలో రజినీకాంత్ హీరో కాగా, ‘కుభేర’ చిత్రంలో ధనుష్ హీరో. కూలీ లో నాగార్జున మెయిన్ విలన్ రోల్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇది ఎంత వరకు నిజమో చూడాలి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ‘కుభేర’ చిత్రంలో మాత్రం పాజిటివ్ రోల్ చేస్తున్నాడు. చూస్తుంటే నాగార్జున మనసు లీడ్ రోల్స్ వైపు నుండి క్యారక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యినట్టు అనిపిస్తుంది. అందుకే అక్కినేని అభిమానులు తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ తో ఉన్నారు. పోనీ ఆయన కొడుకులను చూసి ఆనందపడుదామా అంటే అఖిల్ ఇప్పట్లో తొలి హిట్ కొట్టేలా కనిపించడం లేదు. నాగ చైతన్య హిట్స్ ఇస్తున్నాడు కానీ, ఆ హిట్ సినిమాల్లో నాగ చైతన్య కంటే ఎక్కువగా హీరోయిన్స్ కి పేరొస్తుంది. పాపం అక్కినేని ఫ్యాన్స్ పడుతున్న బాధ ఏ హీరో అభిమాని కూడా పడకూడదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.