Nagarjuna The Ghost Premier Talk: కింగ్ నాగార్జున ది ఘోస్ట్ గా దసరా బరిలో దిగారు. ఇంటర్ పోల్ ఆఫీసర్ గా వెండితెరను చెడుగుడు ఆడేస్తా అంటున్నారు. చాలా కాలం తర్వాత నాగార్జున, చిరంజీవి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు విడుదలయ్యాయి. అయితే ఈ రెండు చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఐదేళ్ల గ్యాప్ తర్వాత ది ఘోస్ట్ తెరకెక్కించారు. ఆయన గత చిత్రం గరుడ వేగ 2017లో విడుదలైంది. గరుడ వేగ ప్రవీణ్ సత్తారుకు ఫేమ్ తెచ్చిపెట్టిన నేపథ్యంలో నాగార్జున పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. మరి ఆయన నమ్మకాన్ని ప్రవీణ్ ఎంత వరకు నిలబెట్టుకున్నారో చూద్దాం.

అక్టోబర్ 5న ది ఘోస్ట్ మూవీ వరల్డ్ వైడ్ విడుదలైంది. అర్థరాత్రి నుండే ప్రీమియర్స్ ప్రదర్శన మొదలైంది. మూవీ చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ కలగలిపి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ది ఘోస్ట్ చిత్రాన్ని ప్రవీణ్ సత్తారు మలిచారు. యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కించారు. పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ పై కనిపిస్తుంది. విదేశాల్లో యాక్షన్ సన్నివేశాలు, లొకేషన్స్ ఆకట్టుకుంటాయి.
నెమ్మదిగా మొదలైన కథనం ఇంటర్వెల్ సమయానికి ఊపందుకుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్, ఆ ఎపిసోడ్ చాలా బాగా తీర్చిదిద్దారు. ఇక సెకండ్ హాఫ్ ని ప్రవీణ్ మరింత మెరుగ్గా తెరకెక్కించాడు. ఆయన రాసుకున్న రేసీ స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు గొప్ప అనుభూతి పంచుతుంది. కథలో ట్విస్ట్స్ తో పాటు ప్రీ క్లైమాక్స్ ఫైట్, క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి. ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నాగార్జున చాలా స్టైలిష్ గా ఉన్నారు. యాక్షన్ సన్నివేశాల్లో కుమ్మేశారు. ఈ వయసులో ఆయన ఎనర్జీని మెచ్చుకోవాల్సిందే.
సోనాల్ కి చాలా కాలం తర్వాత ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది. ఆమె గ్లామర్, పెర్ఫార్మన్స్ మెప్పిస్తాయి. బీజీఎం చెప్పుకోవాల్సిన మరో అంశం. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఇక ది ఘోస్ట్ మూవీలో కొన్ని నెగిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతగా ఆకట్టుకోలేదనేది ప్రేక్షకుల అభిప్రాయం. మెల్లగా సాగే కథనం, ఎమోషనల్ సన్నివేశాలు కొంచెం ఇబ్బంది పెడతాయి. ఫస్ట్ హాఫ్ ని ఇంకొంచెం బెటర్ గా తీర్చిదిద్ది ఉంటే ది ఘోస్ట్ మరో లెవల్ లో ఉండేది.

మొత్తంగా దసరాకు నాగార్జునకు హిట్ పడ్డట్లే అనేది మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం. లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసి విడుదల చేసిన నేపథ్యంలో మంచి ఓపెనింగ్స్ దక్కే సూచనలు కలవు. పండగ సెలవులు క్యాష్ చేసుకుంటే ది ఘోస్ట్ వీకెండ్ గ్రాండ్ గా ముగించవచ్చు. మరి చూడాలి ది ఘోస్ట్ నాగార్జున ఏ స్థాయి విజయం అందిస్తుందో…