Thandel Movie : అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తండేల్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో గానే సాగినప్పటికీ నాగ చైతన్య అద్భుతమైన పెర్ఫార్మన్స్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాని కాపాడింది. ప్రతీ సినిమాకి తన పెర్ఫార్మన్స్ తో హైలైట్ గా నిలిచే సాయి పల్లవి, ఈ సినిమాలో మాత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. నాగ చైతన్య నటన, అతను ఉపయోగించిన యాస చాలా నేచురల్ గా అనిపించింది. అలా రావటానికి ఆయన చాలా హోమ్ వర్క్ చేసాడు. సాయి పల్లవి అలాంటి హోమ్ వర్క్ చేయలేదని ఈ సినిమా చూసినప్పుడు అనిపించింది. ఆమె నటన, యాస చాలా ఆర్టిఫీషియల్ గా అనిపించింది. మొట్టమొదటిసారి ఒక హీరో సాయి పల్లవి ని డామినేట్ చేయడం ఈ సినిమాకే జరిగింది అనొచ్చు.
ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే డైరెక్టర్ ఎందుకో సినిమాటిక్ లిబర్టీ కోసం, కమర్షియల్ ఎలిమెంట్స్ ని నింపి సినిమాలో ఉన్న ఎమోషనల్ కనెక్ట్ ని తగ్గించాడని అనిపించింది. అత్యధిక సార్లు ‘బుజ్జి తల్లి’ అనే పదాన్ని ఉపయోగించడం వల్ల ప్రేక్షకులకు కాస్త చిరాకు కలుగుతుంది. ఓవరాల్ గా ఈ సినిమాని నాగ చైతన్య పెర్ఫార్మన్స్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాపాడింది అని చెప్పొచ్చు. కొన్ని సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. అవే ఈ చిత్రానికి బలం, పాకిస్తాన్ సన్నివేశాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ఊహించినంత రేంజ్ లో అయితే లేదు కానీ, పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనే విధంగా ఉంది. ఈమధ్య కాలం లో డైరెక్టర్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోతే సినిమాని చూడరేమో అనే భయం తో, ఇలాంటి సెన్సిటివ్ కంటెంట్ ఉన్న సినిమాల్లో కూడా సినిమాటిక్ లిబర్టీ అంశాన్ని తీసుకుంటున్నారు.
ఒకప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ వేరు, ఇప్పటి ఆడియన్స్ మైండ్ సెట్ వేరు. కథ కి అడ్డంగా వచ్చే సన్నివేశాలు తీస్తే అసలు క్షమించడం లేదు. తండేల్ లో అలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఇక నిర్మాత అల్లు అరవింద్ ప్రొమోషన్స్ లో ఈ చిత్రానికి 80 కోట్లు ఖర్చు చేశామంటూ ఊదరగొట్టేశాడు. కానీ VFX వర్క్ చాలా బలహీనంగా ఉంది. అనేక సన్నివేశాలు క్వాలిటీ పరంగా చాలా చీప్ గా అనిపించాయి. మంచి కథని ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించకుండా ఏమి చూపించాలని అనుకున్నారో, అది చూపించి ఉండుంటే, ఈ సినిమా ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యేది. సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుడికి ఈ ఫీలింగ్ వస్తుంది. ఇక సాయి పల్లవి ఎప్పటి లాగానే ఈ సినిమాలో కూడా డ్యాన్స్ ఇరగదీసింది కానీ, నటన పరంగా కాస్త ఫోకస్ పెట్టి ఉండుంటే బాగుండేది అనిపించింది.