Music Director Chakravarthy Biography: అలనాటి సంగీత దర్శకుడు చక్రవర్తి అంటే.. ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఆయన అంత గొప్పగా పాటలను అందించాడు. ఆయన పాటల్లో మధురమైన సంగీతం ఉంటుంది. కాగా చక్రవర్తి అసలు పేరు ‘కొమ్మినేని అప్పారావు’.
బాల్యం :
అప్పారావుది గుంటూరు జిల్లా, పొన్నెకల్లు గ్రామం. 1936 సెప్టెంబర్ 8వ తేదీన ఆయన జన్మించారు. తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, బసవయ్య. వారిది ఉన్నతమైన వ్యవసాయ కుటుంబం. ఆ రోజుల్లో అప్పారావు గారి ఊరిలో చదువుకున్న వ్యక్తి ఆయన ఒక్కరే. అందుకే అందరూ ముద్దుగా అప్పిగా అని పిలిచే వారు. పైగా ఆయన అంటే.. అందరికీ గొప్ప అభిమానం. ఇక చిన్న తనం నుంచి అప్పారావుకి సంగీతం పై ఆసక్తి ఎక్కువుగా ఉండేది. అతని ఉత్సాహం చూసి తండ్రిగారు గుంటూరులో ఉన్న మహావాది వెంకటప్పయ్య శాస్త్రి దగ్గర సంగీతం నేర్పించారు.
Also Read: ఛాన్స్ లు రాక కూలీ పనులు చేసిన స్టార్ హీరో
అలా సంగీతం నేర్చుకున్న అప్పారావు, ఆ తర్వాత వినోద్ ఆర్కెస్ట్రా అనే బృందాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో పాటలు, పద్యాలు పాడుతూ ప్రతి గ్రామం తిరుగుతూ ప్రదర్శనలు ఇచ్చేవారు. అది అప్పారావు తండ్రి బసవయ్య గారికి నచ్చలేదు. బాగా చదువుకుని ఇదేమిటి ? అంటూ ఆయన బాధ పడుతూ ఉండేవారు.
తండ్రి బాధను అర్ధం చేసుకున్న అప్పారావు ఇక విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ కావాలని నిర్ణయించుకున్నారు. అలా 1954-58ల మధ్యన అప్పారావు ఆల్ ఇండియా రేడియోలో పని చేశారు. ఆ రోజుల్లో కె.అప్పారావు కంఠంతోనే ఆయన పాటలతో తెలుగు నెల ప్రతిధ్వనించేది. నాటి శ్రోతలకి అప్పారావు కంఠం బాగా పరిచయం కూడా.
సినీ రంగ ప్రవేశం :
అయితే, అప్పారావుకి ఎక్కడో బాధ. తెలియని కోపం. నేనేమిటి ? ఏమి చేస్తున్నాను ? అని తనలో తానే నిత్యం అనుకుంటూ ఉండేవారు. అలా ఒకరోజు తన మేనమామ కూతురు రోహిణి ఆ మాటలు వింది. ఆమె అంటే, అప్పారావుకి ప్రేమ. ఆమెనే అప్పారావుకి సలహా ఇచ్చింది, సినిమాల్లోకి వెళ్ళు బావ అని. అంతే, ఆ వెంటనే రోహిణి మెడలో అప్పారావు తాళి కట్టి.. భార్యతో కలిసి మద్రాసు రైలు ఎక్కాడు.
మొదటి అవకాశం :
అప్పారావు మద్రాసు వచ్చి హెచ్.ఎమ్.వి. వారికి గ్రామఫోన్ పాటలు పాడటం మొదలు పెట్టాడు. ఒక రికార్డింగ్ లో సంగీత దర్శకులు రాజన్, నాగేంద్రలు కలిశారు. అప్పారావు గొంతు వాళ్లకు నచ్చింది. అవకాశం ఇప్పించి పాడించారు. ఆ తర్వాత బి.విఠలాచార్య అప్పారావుకి తన సినిమా ‘జయ విజయ’లో పాట పాడే అవకాశం ఇచ్చారు. ఆ పాటను చిత్రంలో హాస్యనటుడు బాలకృష్ణ పాడతాడు. ఇదే అప్పారావు సినిమాలో పాడిన మొదటి పాట.
అంతలో.. ‘ ఫలోమా’ అనే మలయాళ చిత్రం హిందీ డబ్బింగ్ కి వచ్చింది, దానికి అప్పారావుని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. టైటిల్స్ లో అన్నీ హిందీ పేర్లే ఉన్నాయి, వాటి మధ్య అప్పారావు అనే తెలుగు పేరు ఎందుకని ఆ సినిమా వారు అప్పారావుకి చెప్పి చక్రవర్తిగా పేరు వేశారు. ఈ విధంగా అప్పారావు చక్రవర్తిగా మారాడు. ‘మూగ ప్రేమ’లో ఆయన ఇచ్చిన పాటలు బాగున్నాయి అని పేరు వచ్చింది.
ఆ తర్వాత, భలే గూఢచారి (1970), తల్లీ కూతుళ్ళు (1971) చిత్రాలకు సంగీత దర్శకుడిగా చాలా గొప్ప పేరు వచ్చింది. ముఖ్యంగా మూగ ప్రేమలో ఈ ‘సంజెలో…, నాగులేటి వాగులోన…’ అనే పాటలు ఆయనకు అద్భుతమైన పేరు తెచ్చి పెట్టాయి.
కానీ, 1976 -88 మధ్య కాలంలో చక్రవర్తి నిజంగా చక్రవర్తిగా ఒక వెలుగు వెలిగిపోయారు. ఎన్టీఆర్ చిత్రాలు ‘అన్నదమ్ముల అనుబంధం’, ‘యమగోల’, ‘డ్రైవర్ రాముడు’, ‘వేటగాడు’, ‘ఛాలెంజ్ రాముడు’ వంటి చిత్రాలకు చక్రవర్తి అద్భుత సంగీతాన్ని సమకూర్చారు.
అన్నిటికీ మించి రీరికార్డింగ్ చెయ్యడంలో చక్రవర్తి మేటి. ‘సర్దార్ పాపారాయుడు’ వంటి చిత్రాల్లో థీమ్ మ్యూజిక్ వంటి అంశాన్ని మొదటిసారి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఆయనే. ‘తీర్పు’ చిత్రంలో అతి తక్కువ వాద్యాలతో పాటలు స్వరపరచి సినీ సంగీతానికి కొత్త అర్ధం ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’, ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ పాటలకు సంగీత సొబగులద్ది రికార్డులుగా విడుదల చేస్తే నేటికీ అవే పాటలను ఎన్నికల ప్రచారం కోసం ఆ పార్టీ పెద్దలు వాడుకుంటున్నారు. అది చక్రవర్తి గొప్పతనం.
దర్శకత్వం వైపు :
చక్రవర్తి దృష్టి కొంతకాలం దర్శకత్వం వైపు కూడా మొగ్గింది. ‘నిలువు దోపిడీ’, ‘దేశోద్ధారకులు’ చిత్రాలకు సహాయ దర్శకుడిగా కూడా పనిచేశారు. పైగా చక్రవర్తి కొన్ని చిత్రాలలో కూడా నటించారు కూడా. చివరిసారిగా నిన్నే ప్రేమిస్తా చిత్రంలో సౌందర్య నాన్నగారిగా ఆయన నటించారు. ఇక చక్రవర్తి గారు 2002 ఫిబ్రవరి 3న కన్నుమూశారు.
Also Read: ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న ‘రామారావు’
Recommended Video: