Mrunal Thakur: హీరోయిన్ కు అప్పుడప్పుడు పాత్ర గౌరవం తెస్తుంది.. విశ్వ వేదికపై నిలబెడుతుంది

ఏ చిత్ర పరిశ్రమైనా తీసుకోండి.. అందులో 99.9% హీరోయిన్లు కేవలం గ్లామర్ షో కు మాత్రమే పరిమితమవుతారు. మేల్ డామినేషన్ ఉన్న ఇండస్ట్రీలు కాబట్టి హీరోకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని హీరోయిన్లకు ఇవ్వరు. అందువల్లే ఎంతో నైపుణ్యం ఉన్నప్పటికీ చాలామంది హీరోయిన్లు మరుగున పడిపోతుంటారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 16, 2024 10:31 am

Mrunal Thakur

Follow us on

Mrunal Thakur: మహానటి సావిత్రి ఎన్ని చిత్రాల్లో నటించినప్పటికీ మిస్సమ్మ అనే పేరు ఆమెకు ప్రత్యేకం.. విజయశాంతి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించినప్పటికీ రాములమ్మ అంటే ఆమెకు ఒక గౌరవం.. అనుష్క ఎంత పెద్ద హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నప్పటికీ జేజమ్మ అంటే ఆమెకు అమితానందం. జెనీలియా ఎంత మంచి పాత్రలు పోషించినప్పటికీ హాసిని అంటే ఆమెకు ప్రత్యేక గుర్తింపు.. మృణాల్ తెలుగు తెరకు సీతగా పరిచయమైన ఈ నటికి లవ్ సోనియా సినిమాలో సోనియా పాత్ర ప్రత్యేకం. ఎందుకంటే ఆ పాత్ర ఆమెను విశ్వవేదికపై నిలబెట్టబోతోంది. ఇంతకీ దీని వెనక ఏం జరిగిందంటే..

ఏ చిత్ర పరిశ్రమైనా తీసుకోండి.. అందులో 99.9% హీరోయిన్లు కేవలం గ్లామర్ షో కు మాత్రమే పరిమితమవుతారు. మేల్ డామినేషన్ ఉన్న ఇండస్ట్రీలు కాబట్టి హీరోకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని హీరోయిన్లకు ఇవ్వరు. అందువల్లే ఎంతో నైపుణ్యం ఉన్నప్పటికీ చాలామంది హీరోయిన్లు మరుగున పడిపోతుంటారు. అయితే ఈ జాబితాలో.. మరీ ముఖ్యంగా ఈ తరంలో మృణాల్ ఠాకూర్ ను ఎందుకు మినహాయించాలి. మన తెలుగు తెరకు సీతారామం సినిమా ద్వారా ఆమె సీతగా పరిచయమైనప్పటికీ.. అంతకంటే ముందే ఆమె 2018లో లవ్ సోనియా అనే చిత్రంలో అద్భుతమైన పాత్ర పోషించారు. మానవ అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో మృణాల్ అద్భుతంగా నటించారు. మానవ అక్రమ రవాణా బాధితురాలి పాత్రలో ఆమె ఒదిగిపోయారు. కథానాయకగా ఈ సినిమాలో ఎన్నో సాహసాలు చేశారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆ సినిమాకు సంబంధించిన కొన్ని దృశ్యాలు తారస పడుతూనే ఉంటాయి. ఆ చిత్రంలో పోషించిన పాత్రకు గానూ మృణాల్ ఠాకూర్ కు అరుదైన గౌరవం లభించింది. అది కూడా న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం నుంచి..

మానవ అక్రమ రవాణాకు సంబంధించి ఐక్యరాజ్యసమితి హ్యూమన్ కాస్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ సె*** వ**** అనే కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి మృణాల్ ను ఆహ్వానించింది. మానవ అక్రమ రవాణా, బాధితుల ఇబ్బందులు, లైంగిక పరమైన హింస, వాటి వల్ల చోటు చేసుకున్న దుష్పరిణామాలపై ఐక్యరాజ్యసమితి ఏర్పాటుచేసిన పానెల్ ఆ సదస్సులో చర్చించనుంది. మానవ అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందిన లవ్ సోనియా సినిమాలో బాధితురాలిగా మృణాల్ నటించిన నేపథ్యంలో.. ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు ఆ చర్చలో ఆమెను భాగస్వామిని చేశారు. ఈ సందర్భంగా మానవ అక్రమ రవాణా, తర్వాతి పరిణామాలపై మృణాల్ చర్చిస్తారు. సినిమా షూటింగ్లో తన అనుభవాలను వెల్లడిస్తారు. ఐక్యరాయ్ సమితి ఆహ్వానించడంతో మృణాల్ హాస్యం వ్యక్తం చేశారు. ” ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం. లవ్ సోనియాలోని నా పాత్ర ద్వారా మానవ అక్రమ రవాణాలో సమస్య సంక్లిష్టతను అర్థం చేసుకునేందుకు నాకు అవకాశం లభించింది. ఈ పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రొటీన్ సినిమాలా కాకుండా.. ఇందులో భావోద్వేగాలకు దర్శకుడు పెద్దపీట వేశారు. అందువల్లే ఈ చిత్రంలో నేను నటించానని” మృణాల్ పేర్కొంది. ఈ సదస్సులో బాలీవుడ్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.