వెబ్ సిరీస్ : సైతాన్
నటీనటులు : రిషి, షెల్లీ, రవి కాలే, దేవయానీ శర్మ, జాఫర్ సాదిక్, నితిన్ ప్రసన్న, కామాక్షి భాస్కర్ల, మణికందన్ నటించారు. చాయగ్రహణం: షణ్ముఖ సుందరం
సంగీతం: శ్రీరామ్ మద్దూరి
నిర్మాతలు: మహి వి రాఘవ్, చిన్నా వాసుదేవ్ రెడ్డి
రచన, దర్శకత్వం: మహీ వీ రాఘవ్.
Shaitan Web Series Review : కోవిడ్ తర్వాత సినిమాల కంటే వెబ్ సిరీస్ లకు ఆదరణ పెరుగుతోంది. పేరుపొందిన దర్శకులు కూడా వెబ్ సిరీస్ లను తీసేందుకు ఇష్టపడుతుండడం, ఇందులో సెన్సార్ లాంటి చిక్కులు లేకపోవడం, పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఇందులో పాలుపంచుకోవడంతో ప్రేక్షకులకు కూడా ఆసక్తి కలుగుతుంది. ఒకప్పుడు హాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన వెబ్ సిరీస్ లు.. ఇప్పుడు తెలుగు నాట కూడా సందడి చేస్తున్నాయి. అలాంటి వెబ్ సీరీసే “సైతాన్”.. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. దీనికి సంబంధించి యూట్యూబ్ లో విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులకు ఆసక్తి కలిగించింది. హింసాత్మక సన్నివేశాలు, ద్వంద్వర్ధాలతో కూడిన మాటలు ఉండటంతో ఒక సెక్షన్ ఆడియన్స్ దీనిపై ఆసక్తి ప్రదర్శించారు. ఇంతకీ ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..
ఈ వెబ్ సిరీస్ కు మహి వీ రాఘవ్ దర్శకత్వం వహించాడు. అంతకుముందు ఇతడు యాత్ర, ఆనందోబ్రహ్మ, చిత్రాలు, సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించాడు. ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేవే. సైతాన్ విషయానికి వచ్చేసరికి పూర్తి విభిన్నం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు నక్సలైట్ల సమస్య తీవ్రంగా ఉండేది. నక్సలైట్ల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు అప్పటి ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. అలాంటి సందర్భంలోనే విజయ్ కుమార్ అనే ఒక నక్సలైట్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారాడు. అతడిని మట్టు పెట్టేందుకు ప్రభుత్వం ఏకంగా గ్రేహౌండ్స్ అనే పోలీస్ దళాన్ని ఏర్పాటు చేసింది. చివరికి విజయ్ కుమార్ హతమైనప్పటికీ.. ఈ మధ్యలో జరిగిన పరిణామాలు ఇప్పటికీ రహస్యమే. అయితే వీటికి సినిమాటిక్ లిబర్టీ తీసుకుని మహి వీ రాఘవ్ సైతాన్ అనే వెబ్ సిరీస్ రూపొందించాడు. ఎపిసోడ్లతో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే దృష్టిలో పెట్టుకొని తీశానని రాఘవ్ పలు సందర్భాల్లో చెప్పాడు. ఇంతకీ ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..
కథ ఏంటంటే
సావిత్రి (షెల్లీ నబు కుమార్)కు బాలి(రిషి), జయ (దేవయాని శర్మ), గుమ్తి(జాఫర్ సాదిక్) ముగ్గురు పిల్లలు. భర్త వదిలేసి వెళ్లడంతో పిల్లల పోషణ కోసం ఒక పోలీసు కు ఉంపుడు గత్తేగా ఉంటుంది. తమ తల్లి గురించి సమాజం రకరకాలుగా మాట్లాడుకుంటుండడంతో బాలి తరలించుకుని తిరుగుతూ ఉంటాడు. తల్లి కోసం వచ్చే పోలీస్ తన చెల్లి మీద కన్ను వేయడంతో అతడి తలను బాలి తెగ నరుకుతాడు. పోలీసును చంపిన కేసులో బాలి జైలుకు వెళ్లి వస్తాడు. ఆ తర్వాత అతడు నేరస్తుడిగా ఎలా మారాడు? ఎంత మందిని చంపాడు? దళంలోకి ఎలా వెళ్లాడు? దళ నాయకత్వంతో గొడవలు ఎందుకు పడ్డాడు? సాక్షాత్తు రాష్ట్ర హోంశాఖ మంత్రి నుదుటిమీద రివాల్వర్ ఎలా ఎక్కుపెట్టాడు? బాలీ ప్రయాణంలో కళావతి పాత్ర ఏంటి? పోలీసు అధికారి నాగిరెడ్డి తో సాగించిన ప్రయాణం ఏంటి? ఈ ప్రశ్నలకు 9 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ ద్వారా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశాడు మహి వి రాఘవ్.
ఎలా ఉందంటే
కత్తితో తలను తెగ నరికితే రక్తం విరజిమ్ముతుంది. మనసులో దాగి ఉన్న పగ ఒక్కసారిగా చల్లారుతుంది. ఈ సినిమాలో బాలి జీవితం గురించి చెప్పాలంటే పై రెండు వాక్యాలు చాలు. ఎందుకంటే బాలి అనే వాడు ఒక బాధితుడు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేయడం మొదలు పెట్టినవాడు. చివరికి అదే విధంగా తాను చాలించినవాడు. ఇలాంటి వారి జీవిత చరిత్రతో తెలుగు నాట ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. వాటికి, సైతాన్ కు వ్యత్యాసం ఏంటంటే.. ఇది వెబ్ సిరీస్ కావడం, పైగా ఎటువంటి సెన్సార్ లేకపోవడంతో సిరీస్ మొత్తాన్ని బోల్డ్ గా చిత్రీకరించారు. అంటే హార్డ్ రియాల్టీని బలంగా చూపించారు. ఈ వెబ్ సిరీస్ లో తలలు తెగిపడే సన్నివేశాలు చాలా ఉంటాయి. మహిళలను బలాత్కరించే సన్నివేశాలు కూడా చాలా ఉంటాయి. రాయలేని భాషలో డైలాగులు కూడా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సైతాన్ లో హింస, శృంగారం, బూతులు మాత్రమే కాదు.. అంతకుమించి.. బాలి, అతడి కుటుంబ సభ్యులు హత్యలు చేస్తుంటే.. వాళ్లు అలా చేయడంలో తప్పు లేదని భావించే స్థాయిలో మహీ వీ రాఘవ్ ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించాడు. ఇక మిగతా విభాగాలు కూడా అతడికి వెన్ను దన్నుగా నిలవడంతో.. అతడు అనుకున్నట్టుగా ఈ సిరీస్ వచ్చింది. బిడ్డలకు సంజాయిషీ చెప్పుకునే పరిస్థితి రాకూడదని బాలి చెప్పే సీన్, మాటలు రాని ఆటో డ్రైవర్ ను జయ కౌగిలించుకునే సీన్.. చెక్కులను కదిలిస్తాయి. అయితే ఇంతటి రఫ్ సిరీస్లో అవి తేలిపోయాయి. భర్త లేని మహిళ మరో మగాడితో సంబంధం పెట్టుకుంటే రకరకాల మాటలు మాట్లాడే ఈ సమాజం.. మరి ఆ మగాడికి ఏం పేరు పెట్టలేదు? అని సమాజాన్ని ప్రశ్నించారు మహీవి రాఘవ్. మొదటి ఎపిసోడ్ నుంచే సైతాన్ ప్రపంచంలోకి రాఘవ్ తీసుకెళ్లాడు. జైల్లో భూ దందాల నుంచి సెటిల్మెంట్ ల వరకు జరుగుతున్నట్టు గతంలో చాలా సినిమాల్లో చూపించినప్పటికీ.. ఈ వెబ్ సిరీస్ లో మాత్రం కొత్తగా అనిపిస్తుంది. అయితే బాలి అండ్ ఫ్యామిలీ నుంచి కథ కొంచెం పక్కకు జరిగినప్పుడు వెబ్ సిరీస్ కాస్త డౌన్ అయినట్టు కనిపిస్తుంది. ఇక దళం, పోలీసు నేపథ్యంలో సీన్స్ అంతగా ఆకట్టుకోవు. వాటి వల్ల సిరీస్ లెంగ్త్ అయినట్టు కనిపిస్తుంది. హోం మంత్రికి ఒక రౌడీషీటర్ దమ్ కి ఇచ్చి వెళ్లిపోవడం సాధ్యమేనా? వంటి లాజిక్కులను భూతద్దంలో పెట్టి చూస్తే ఈ వెబ్ సిరీస్ చూడలేం.
ఎవరు ఎలా చేశారు అంటే
బాలి పాత్రలో రిషి ఒదిగిపోయాడు. కోపం, ఆవేశాన్ని , దుఃఖాన్ని సరిగా చూపించాడు. జయప్రదగా దేవయానీ శర్మను చూస్తే సేవ్ ద టైగర్స్ లో చైతన్య కృష్ణకు జోడిగా నటించింది ఈమేనా? అనిపిస్తుంది. ఇక జాఫర్ బదులు మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేం. కామాక్షి, షెల్లీ, రవి కాలే కు సవాల్ విసిరే పాత్రలు మాత్రం అవి కావు. వారు ఈజీగా చేసుకుంటూ వెళ్లారు.
చివరిగా ప్రతి మనిషిలోనూ కొంత జంతు ప్రవృత్తి దాగి ఉంటుంది. మృగం(సైతాన్) దాగి ఉంటుంది. దాన్ని చూపించే ప్రయత్నం మహీ. వీ. రాఘవ్ చేశాడు. ముందే అతను చెప్పాడు కాబట్టి ఇది ఫ్యామిలీ ఆడియన్స్ తో చూసే వెబ్ సిరీస్ మాత్రం కాదు.
రేటింగ్; 3/5