Akhanda 2 Review: రివ్యూ: అఖండ 2: తాండవం
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, సంయుక్త, హర్షాలి మల్హోత్రా, ఆది పినిశెట్టి, కబీర్ దుహాన్ సింగ్, సర్వదమన్ బెనర్జీ, సంగె షెల్ట్రిమ్ తదితరులు.
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: C.రామ్ ప్రసాద్, సంతోష్
దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి అచంట
కరోనా కాలంలో విడుదలైన ‘అఖండ’ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించడంతో సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అఖండ సినిమా ఓటీటీలోకి, టీవీ ఛానెల్స్ లోకి వచ్చిన తర్వాత హిందీ ప్రేక్షకుల నుంచి కూడా భారీ ఆదరణ దక్కించుకుంది. దీంతో మన తెలుగు మేకర్స్ మొదలుపెట్టిన ప్యాన్ ఇండియా ట్రెండ్ లో ఇది కూడా జాయిన్ అయింది. గత వారమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ మనీ అడ్డంకుల వల్ల వాయిదా పడి డిసెంబర్ 12 న రిలీజ్ అయింది. ఈ సీక్వెల్ తో దర్శకుడు బోయపాటి ప్రేక్షకులను మెప్పించాడా? బాలయ్య – బోయపాటి హిట్ కాంబినేషన్ ను కొనసాగించాడా అనేది రివ్యూ లో చూద్దాం.
మురళికృష్ణ(బాలకృష్ణ) కూతురైన జనని ని కాపాడిన తర్వాత తను ఎప్పుడు ఆపదలో ఉన్నా, తనను తలుచుకున్న వెంటనే క్షణాల్లో తన ముందు ఉంటానని అఖండ హామీ ఇవ్వడంతో మొదటి భాగం ముగుస్తుంది. అది జరిగిన షుమారు 15 ఏళ్ల తర్వాత అఖండ 2: తాండవం కథ మొదలవుతుంది. మురళికృష్ణ కుమార్తె జనని(హర్షాలి మల్హోత్రా) డీఆర్డీఓలో ట్రైనీ గా చేరుతుంది. తన టీమ్ తో కలిసి కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే సైనికులకు ఉపయోగపడే ఒక ప్రాజెక్ట్ లో రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కు మెంటార్ సంయుక్త మీనన్.
అదే సమయంలో రాజకీయంగా ఎదగాలనే ఆశలతో ఉన్న ఠాకూర్(కబీర్ దుహాన్ సింగ్) భారతదేశాన్ని నాశనం చేయాలని కుట్రలు చేసే విదేశీ శక్తులతో కలిసి మహాకుంభమేళాలో భక్తులకు సోకేలా ఒక బయో వైరస్ ను నదిలో కలపాలని, కరోనా వైరస్ తరహాలో దేశం అల్లకల్లోలం అవుతుంది కాబట్టి ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని, దాని సహాయంతో ప్రభుత్వాన్ని కూలదోయలని ప్లాన్ చేస్తాడు. అలాగే కుంభమేళాలో వైరస్ నదిలో కలుపుతారు. దీంతో భారతదేశంలో హెల్త్ ఎమర్జెన్సీ వస్తుంది. ఈ వైరస్ కు యాంటీ డోట్ గా జనని టీమ్ కనిపెట్టిన వ్యాక్సిన్ పని చేస్తుందని తెలియడంతో ఠాకూర్ జనని టీమ్ అందరినీ చంపి ఆ యాంటి డోట్ దక్కించుకునే ప్రయత్నం చేస్తాడు ఠాకూర్. దీంతో జనని ఆపదలో పడుతుంది. అఖండ ఆగమనం తప్పనిసరి అవుతుంది. ఈ కొత్త బయో వైరస్ ను భారతీయులు అడ్డుకోగలిగారా? జనని ప్రాణాలను, అలాగే భారతదేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న వారిని అఖండ అడ్డుకున్నాడా అనేది మిగతా కథ. కథలోనే మరో లేయర్ గా క్షుద్ర పూజలు చేసే నేత్ర(ఆది పినిశెట్టి ) ఏ రకంగా అఖండను అడ్డుకునే ప్రయత్నం చేశాడు అనే అంశాలు సినిమాలో చూడాలి.
అఖండ సినిమాలో మురళి కృష్ణ పాత్ర ఫస్ట్ హాఫ్ అంతా కవర్ చేస్తే టైటిల్ రోల్ అయిన అఘోర పాత్ర ఇంటర్వెల్ కు కాసేపు ముందు మాత్రమే ఎంట్రీ ఇచ్చి షాక్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ అంతా ప్రేక్షకులకు ఒక హై ఇస్తుంది. అంచనాలు కూడా ఎక్కువగా లేకపోవడం కూడా ఆ సినిమాకు ప్లస్ అయింది. ఇక్కడ సీక్వెల్ దగ్గరికి వచ్చేసరికి కథను కొనసాగించడం, ప్యాన్ ఇండియా ఫిల్మ్ గా మలిచే ప్రయత్నంలో సాగదీతకు గురయింది. మొదటి అరగంటను మినహాయిస్తే మురళికృష్ణ పాత్ర పూర్తిగా వీక్ అయింది. ఉన్న కాసేపు బాగానే ఉన్నా తర్వాత మాత్రం ఆ పాత్రను పూర్తిగా పక్కన పెట్టారు. ఇక బయో వైరస్, దాని చుట్టూ జరిగే సంఘటనలు కూడా ఎమోషనల్ గా ప్రేక్షకులను కదిలించలేకపోయాయి. ఇక డీవోషనల్ ఎలిమెంట్స్ కథకు తగినట్టు కాకుండా ప్రెజెంట్ సినిమాల ట్రెండ్ అయిన సనాతన ధర్మం, హిందూ మతం ఎలివేషన్స్ కోవలో కొంత మేరకు అతి చేసినట్టు అనిపించింది కానీ సహజంగా అనిపించలేదు. అలా అని అన్నీ నీరసంగా ఏమీ లేవు. హనుమాన్ ఎపిసోడ్, శివుడి ఎపిసోడ్, ఆది పినిశెట్టి తో ఫైట్ ఎపిసోడ్ లాంటి యాక్షన్ సీక్వెన్సులు అద్భుతంగా కుదిరాయి.
ఎప్పటిలాగే బాలయ్య తనకు మాత్రమే సాధ్యమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో, డైలాగ్స్ తో మెప్పించాడు. కానీ అఖండ మొదటి భాగంలో డైలాగ్స్ అన్నీ సీన్ కు సిట్యుయేషన్ అవసరమైన స్థాయిలో ఉంటే ఇక్కడ మాత్రం తాండవం టైటిల్ కు తగ్గట్టుగా ఎక్కువయ్యాయి. ప్రధాని పాత్రలో నటించిన సర్వదమన్ బెనర్జీ పాత్ర లెంగ్త్ ఎక్కువైనట్టు అనిపించింది. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి అన్ని సీన్లలో కన్పించడం, ఊరికే రాయలసీమకు రావడం, కుదిరనప్పుడల్లా స్క్రీన్ పై కనిపించి డైలాగ్స్ చెప్పడం ప్రధాని పాత్ర ఔచిత్యాన్ని దెబ్బతీసింది. ఓవరాల్ గా చూసుకుంటే బాలయ్య అభిమానులకు, బాలయ్య స్టైలు మాస్ ప్రేక్షకులకు ఓకె అనిపిస్తుంది కానీ సాధారణ ప్రేక్షకులకు మాత్రం సాగదీసినట్టు, ప్యాన్ ఇండియా అంశాలు అనవసరంగా చొప్పించినట్టు అన్పిస్తుంది.
ఈ సినిమాలో బాలయ్య తర్వాత హైలైట్ ఏంటి అని అడిగితే తమన్ పేరే చెప్పాలి. కొన్ని సీన్లలో నేపథ్య సంగీతం లౌడ్ గా అనిపించింది కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాకు బలంగా నిలిచింది తమన్ సంగీతమే. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులలో తమన్ చెలరేగిపోయాడు. పాటలు ఒకే. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు తగ్గట్టు రిచ్ గా ఉంది. యాక్షన్ సీక్వెన్సులు ఓవర్ అనిపించినా కానీ బాగున్నాయి. సినిమాలో డైలాగ్స్ కొన్ని బాగున్నాయి కానీ అఖండ స్థాయిని అందుకోలేకపోయాయి.
కొన్ని పాత్రలు బాలయ్య కోసమే పుడతాయా అన్నట్టు ఉంటాయి. ఆ పాత్రలు బాలయ్య తప్ప మరొకరు చేయలేరు అని చెప్పడం కూడా అతిశయోక్తేమీ కాదు. తన ఇమేజ్ కు తగ్గట్టే బాలయ్య అటు మురళికృష్ణగా ఇటు అఖండగా చెలరేగిపోయాడు. అలవోకగా డైలాగులు చెప్పుకుంటూ పోయాడు. కబీర్ దుహాన్ సింగ్ పాత్ర పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు, రొటీన్ గా ఉంది. ఆది పినిశెట్టి తాంత్రికుడి పాత్ర బాగుంది. సంయుక్త మీనన్ పాత్ర అటు హీరోయిన్ కాదు ఇటు ప్రధాన పాత్ర కాదు అన్నట్టుగా ఉంది. హర్షాలి మల్హోత్రాకు మంచి పాత్రే దక్కింది. పెద్దగా ఎమోషన్స్ ను పలికించలేకపోవడం వల్లో ఏమో కానీ బార్బీ డాల్ ను ను తలపించింది.
– సినిమాలో బాగోలేనివి ఇవీ..
1. బయోవైరస్, చైనా విలన్ చుట్టూ కథను నడిపించడం
2. ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం
3. కొన్ని పొర్షన్స్ సాగదీసినట్టు అనిపించడం
– ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. బాలయ్య నటన
2. తమన్ సంగీతం
3. యాక్షన్ ఎపిసోడ్స్
ఫైనల్ వర్డ్: సాదాసీదా తాండవం
రేటింగ్: 2. 25/5
