https://oktelugu.com/

Ahimsa Movie Review : అహింస మూవీ రివ్యూ

ఒకప్పుడు తేజ అంటే బ్రాండ్ నేమ్. రాను రాను తన మార్క్ కోల్పోయారు. ఒక మూస ధోరణికి అలవాటు పడి కొత్తదనం ప్రేక్షకులకు అందించలేకపోతున్నారు. అహింస కథ కథనాలు మెప్పించలేకపోయాయి. హీరోయిన్ నటన మాత్రమే చెప్పుకోదగ్గ అంశం. డెబ్యూ హీరోకి ఇలాంటి ప్రారంభం ఊహించనిదే.

Written By:
  • NARESH
  • , Updated On : June 2, 2023 / 06:16 PM IST
    Follow us on

    నటీనటులు : అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు
    మాటలు : అనిల్ అచ్చుగట్ల
    పాటలు : చంద్రబోస్
    ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
    సంగీతం : ఆర్పీ పట్నాయక్
    నిర్మాత : పి. కిరణ్ (జెమినీ కిరణ్)
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : తేజ

    Ahimsa Movie Review : దగ్గుబాటి రామానాయుడు మనవడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం అహింస. ఒకప్పటి సెన్సేషనల్ డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించారు. చాలా కాలంగా వాయిదాపడుతూ వచ్చిన అహింస మూవీ నేడు విడుదలైంది. మరి దగ్గుబాటి వారసుడు డెబ్యూ మూవీ ఎలా ఉందో చూద్దాం….

    కథ:

    రఘు(అభిరామ్) అహింసా సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మే వ్యక్తి. రఘుకి మరదలు అహల్య(గీతికా తివారి) అంటే ప్రాణం. అహల్య కూడా బావ రఘును ఎంతగానో ఇష్టపడుతుంది. దాంతో వారికి కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలనుకుంటారు. రఘుతో నిశ్చితార్థం జరిగిన రోజే అహల్య జీవితంలో అనుకోని పరిణామం చోటు చేసుకుంటుంది. రఘు, అహల్యల జీవితాలు చిన్నాభిన్నం చేసిన ఆ ఘటన రఘు అహింసా సిద్ధాంతం వదిలేసేలా చేస్తుంది. ఆ సంఘటన ఏమిటీ? రఘు పోరాటం సఫలమైందా? లేదా? అనేది మిగతా కథ …

    విశ్లేషణ:

    దర్శకుడు తేజ టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్స్ లో ఒకరు. కొత్తవాళ్లతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన ఘటన ఆయన సొంతం. ఆయన డెబ్యూ మూవీ చిత్రం న్యూ ఏజ్ లవ్ డ్రామా కాగా నువ్వే నువ్వే, జయం ఇంటెన్స్ లవ్ డ్రామాలు. అయితే ఆయన కథలు ఒకేలా ఉంటాయి. పిల్లల ప్రేమను పెద్దలు ఎదిరించడం. ఫస్ట్ లో ఆ ఫార్ములా వర్క్ అవుట్ అయినా తర్వాత కాలేదు. జయం మ్యాజిక్ మరలా రిపీట్ అవలేదు. దీంతో ఈ మధ్య పొలిటికల్ థ్రిల్లర్స్ చేశారు.

    ఒకప్పుడు కథను ఎంటర్టైనింగ్ చెప్పడంలో సక్సెస్ అయిన తేజ అది కోల్పోయాడు. అహింస ఆయన తెరకెక్కించిన చిత్రాల్లో చెత్త మూవీ అని చెప్పుకోవచ్చు. పాతకాలం నాటి కథకు అంతకు మించిన అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే జోడించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. అటు బావమరదళ్ళ ప్రేమ కానీ ఇటు విలన్స్ పై హీరో రివేంజ్, పోరాటం కానీ ఆసక్తి కల్గించలేకపోయాయి. సినిమా ప్రారంభమైన కాసేపటికే ప్రేక్షకులకు అసహనం మొదలవుతుంది. ఆడియన్స్ ఇన్వాల్వ్ అయ్యే ఒక్క సన్నివేశం లేదు.

    నిర్మాతగా అపురూప చిత్రాలు అందించిన సురేష్ బాబు తన కొడుకు డెబ్యూ మూవీకి ఈ తరహా కథ ఎంచుకోవడం ఆశ్చర్యం వేస్తుంది. అలాగే అభిరామ్ నటనలో ఇంకా పరిపక్వత సాధించాలి. అహింస మూవీలో ఆకట్టుకునే అంశాలు ఏమైనా ఉన్నాయంటే హీరోయిన్ గీతికా తివారీ, సీనియర్ హీరోయిన్ సదా నటన. వారిద్దరే ప్రేక్షకులకు కొంచెం ఉపశమనం. ఆర్పీ పట్నాయక్ పాటలు, బీజీఎం కూడా మెప్పించలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా దర్శకుడు తేజ మరోసారి ప్రేక్షకులను నిరాశపరిచాడు. తన మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేశారు.

    ప్లస్ పాయింట్స్:
    హీరోయిన్ యాక్టింగ్
    సదా ప్రెజెన్స్

    మైనస్ పాయింట్స్:

    కథ
    స్క్రీన్ ప్లే
    దర్శకత్వం

    సినిమా చూడాలా? వద్దా?:

    ఒకప్పుడు తేజ అంటే బ్రాండ్ నేమ్. రాను రాను తన మార్క్ కోల్పోయారు. ఒక మూస ధోరణికి అలవాటు పడి కొత్తదనం ప్రేక్షకులకు అందించలేకపోతున్నారు. అహింస కథ కథనాలు మెప్పించలేకపోయాయి. హీరోయిన్ నటన మాత్రమే చెప్పుకోదగ్గ అంశం. డెబ్యూ హీరోకి ఇలాంటి ప్రారంభం ఊహించనిదే.