నిజానికి అప్పటికి పద్మనాభంకు సినిమాల్లో నటించాలి అనే ఆలోచన కూడా లేదు. అయితే, ఓ రోజు మద్రాసుకు వచ్చిన డ్రామా కాంట్రాక్టర్లకు పద్మనాభం, సినిమా స్టూడియోలు చూపిస్తూ వాహినీలోకి అడుగుపెట్టాడు. అదే సమయంలో అక్కడ ‘వెలుగు నీడలు’ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమాలోని ‘భలే భలే మంచి రోజులులే..’ పాటను ఏయన్నార్ పై చిత్రీకరణ చేస్తున్నారు. ఆ పాటలో అప్పటి హాస్యనటుడు సారథి కూడా ఉంటారు. అయితే సారథి వరసగా టేకులు తినడంతో నిర్మాత దుక్కిపాటికి విసుగెత్తుకొచ్చింది.
ఒకపక్క సమయం దాటిపోతుంది. మరోపక్క అనవసరంగా రీల్ ఖర్చు పెరిగిపోతుంది. ఎటు చూసినా నిర్మాతకు నష్టమే కనిపిస్తోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చాడు పద్మనాభం. ఐతే పద్మనాభం మంచి ఆర్టిస్ట్ అనే వియషం అప్పటికీ నిర్మాత దుక్కిపాటికి తెలియదు అట. కానీ ఆశ్చర్యకరంగా ఎందుకో పద్మనాభంను చూస్తూనే ‘నువ్విప్పుడు వేసుకున్న డ్రెస్ బాగుంది. వెంటనే మేకప్ చేయించుకో, నువ్వు ఆ పాత్ర చేయగలవు అనిపిస్తోంది’ అంటూ సారథి పాత్రలో పద్మనాభాన్ని తీసున్నారు నిర్మాత దుక్కిపాటి. కేవలం డ్రెస్ కామెడీగా ఉండటం చూసి ఆయన ఛాన్స్ ఇచ్చాడట.
ఆ విధంగా ‘కర్నూలు ఎక్కడ, కాకినాడ ఎక్కడ…’ అంటూ ఆరంభమయ్యే సాకీని పద్మనాభం మీద చిత్రించడం జరిగింది. పద్మనాభం కూడా సింగిల్ టేక్ లో నటించడం మొత్తానికి అలా తెలుగు సినిమాకి గొప్ప హాస్య నటుడు పరిచయం అయ్యాడు. ఆ పాటే పద్మనాభంకు గుర్తింపును తీసుకొచ్చింది. అప్పటి చలనచిత్ర హాస్యనట చక్రవర్తిగా ఆయన జీవితానికి గట్టి పునాదులు వేసింది ఆ పాట.