Tollywood Deaths : టాలీవుడ్ లో మరణమృదంగం మోగుతోంది. ఎప్పుడెవరి చావు వార్త వినాల్సి వస్తుందోనన్న భయం వెంటాడుతుంది. రోజుల వ్యవధిలో పదిమందికి పైగా కన్నుమూయడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. మృత్యు దేవత విలయ తాండవానికి ప్రతి ఒక్కరూ బెంబేలెత్తుతున్నారు. నటుడు కృష్ణంరాజు మృతితో మొదలైన మరణాలు కొనసాగుతున్నాయి. 2022 సెప్టెంబర్ 11న కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన దీర్ఘకాలంగా హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు. ఆయన మరణించిన కొద్దిరోజులకే మహేష్ తల్లిగారు ఇందిరాదేవి కన్నుమూశారు.

కృష్ణంరాజు మరణం మరవక ముందే మరో లెజెండ్ కృష్ణగారు అస్తమించారు. అర్ధరాత్రి కృష్ణ కార్డియాక్ అరెస్ట్ కి గురయ్యారు. ఆసుపత్రికి చేర్చేసరికే ఆయన పరిస్థితి విషమంగా మారింది. 2022 నవంబర్ 15న కృష్ణ కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు, కుటుంబ సభ్యులు ధృవీకరించారు. వెండితెర సాహసవీరుడు కృష్ణ మరణం పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ముఖ్యంగా మహేష్ అమ్మానాన్నలు రోజుల వ్యవధిలో లోకాన్ని వీడిపోయారు. అదే ఏడాది జనవరిలో అన్నయ్య రమేష్ బాబు మృతి చెందారు. మొత్తంగా ముగ్గురు కుటుంబ సభ్యులను మహేష్ గత ఏడాది కోల్పోయారు.
కృష్ణ కన్నుమూసిన నెలరోజులకు కైకాల సత్యనారాయణ పరమపదించారు. కైకాల చాలా కాలంగా మంచానికే పరిమితమయ్యారు. 2022 డిసెంబర్ 23న ఇంట్లోనే ఆయన తుదిశ్వాస విడిచారు. వెండితెర యముడిగా పేరుగాంచిన కైకాల టాలీవుడ్ గొప్ప నటుల్లో ఒకరిగా పేరుగాంచారు. విలన్, హీరో, క్యారెక్టర్, కమెడియన్ రోల్స్ చేశారు. సుదీర్ఘ కాలం సేవలు అందించారు. కైకాల మరణించిన నెక్స్ట్ డే డిసెంబర్ 24న మరో సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూశారు. చలపతిరావు హఠాన్మరణంతో పరిశ్రమ షాక్ అయ్యింది.
2023 ఏడాది ప్రారంభంలోనే అతిపెద్ద విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ యాక్ట్రెస్ జమున కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో జామున జనవరి 27న తుది శ్వాస విడిచారు. వెండితెర సత్యభామగా పేరుగాంచిన జమున తొలితరం స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు. జమున కన్నుమూసిన వారం రోజుల వ్యవధిలో ఫిబ్రవరి 2న కళాతపస్వి కే. విశ్వనాథ్ కన్నుమూశారు. 92 ఏళ్ల విశ్వనాథ్ కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధింత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన అంత్యక్రియలు ముగిసి 24 గంటలు గడవక ముందు సింగర్ వాణీ ఫిబ్రవరి 4న అనుమానాస్పదంగా కన్నుమూశారు. అలాగే డైరెక్టర్ సాగర్ ఈ ఏడాది కన్నుమూశారు.