Mugamanasulu movie Savitri house : లెజెండ్స్ అక్కినేని నాగేశ్వరరావు-సావిత్రి కాంబోలో అనేక అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో మూగమనసులు కల్ట్ క్లాసిక్ అని చెప్పాలి. 1964లో మూగమనసులు తెరకెక్కింది. మరో హీరోయిన్ గా జమున నటించింది. ఆదుర్తి సుబ్బారావు మూగ మనసులు చిత్రానికి దర్శకుడు. మూగమనసులు బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. అప్పట్లో పలు కేంద్రాల్లో 175 డేస్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఎక్కువ శాతం షూటింగ్ చెన్నైలోని స్టూడియోస్ లో పూర్తి చేసేవారు. కొన్ని సన్నివేశాలు మాత్రమే అవుట్ డోర్ షూటింగ్ చేసేవారు. మూగ మనసులు చిత్రాన్ని మాత్రం అధిక భాగం అవుట్ డోర్ షూట్ చేశారు.
కోనసీమలో మూగ మనసులు షూటింగ్ జరిగింది. గోదావరిలో పడవ నడిపే యువకుడి పాత్ర చేశాడు ఏఎన్నార్. ఈ కారణంగా గోదావరి పరిసర ప్రాంతాల్లో మూగ మనసులు షూటింగ్ జరిగింది. మూగ మనసులు భారీ విజయం సాధించడంతో అవుట్ డోర్ షూటింగ్స్ చేయడంపై దర్శక నిర్మాతలు దృష్టి పెట్టారట. మూగ మనసులు చిత్రాన్ని హిందీలో మిలన్ టైటిల్ తో తెరకెక్కించారు. ఆ సినిమా షూటింగ్ కూడా గోదావరి జిల్లాలో జరగ్గా.. బాలీవుడ్ హీరో సునీల్ దత్ అక్కడకు వచ్చారని సమాచారం. నర్సాపురంలోని వలందర రేవులో ఏఎన్నార్ పడవ నడిపే సన్నివేశాలు చిత్రీకరించారు అట. ఆ రేవు ఎదుట ప్రస్తుతం ఆర్చ్ నిర్మించి ఉంది. దానికి ఎదురుగా ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.
ముఖ్యంగా సావిత్రి ఇంటిగా చూపించిన భవనం గురించి మాట్లాడుకోవాలి. సావిత్రి పెద్దింటి అమ్మాయి పాత్ర చేసిన నేపథ్యంలో.. ఓ పెద్ద భవనంలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ భవనంలోనే సావిత్రి మూగమనసులు మూవీ చిత్రీకరణ జరిగినన్ని రోజులు ఉన్నారని సమాచారం. ఆ భవనం ఇండిపెండెన్స్ రాకముందు డచ్ వారు నిర్మించారట. 1920లో ఆ భవంతి నిర్మాణం జరిగిందట. ఇప్పటికీ నరసాపురంలో ఆ భవనం ఉంది. చెక్కు చెదరకుండా ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తుంది. మీరు నరసాపురం వెళితే ఆ భవంతిని ఒకసారి చూసి రండి.
అయితే మూగ మనసులు సావిత్రికి చేదు అనుభవాలు కూడా మిగిల్చింది. ఈ మూవీని తమిళ్ లో ప్రాప్తం పేరుతో రీమేక్ చేసింది. శివాజీ గణేష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సావిత్రి దర్శకత్వం కూడా వహించారు. 1971లో విడుదలైన ప్రాప్తం దారుణ పరాజయం పొందింది. దాంతో సావిత్రి లక్షల్లో నష్టపోయింది. చివరి రోజుల్లో సావిత్రి దుర్భర జీవితం అనుభవించడానికి మూగమనసులు రీమేక్ కూడా కారణం అయ్యింది.
