Megastar Birthday Surprises: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టిన రోజు రేపు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ హడావుడి మొదలైపోయింది. మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి అభిమానులు సన్నద్ధం అవుతున్నారు. ఇక మెగాస్టార్ తో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలు కూడా చిరు సినిమాలకు సంబంధించిన అప్ డేట్ లతో మెగా సర్ ప్రైజ్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు.
షార్ప్ టేకింగ్ తో ఆకట్టుకునే మెహర్ రమేష్ తో మెగాస్టార్ తమిళ సినిమా ‘వేదాళం’ను తెలుగులోకి రీమేక్ చేసున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ను చిరు బర్త్ డే స్పెషల్ గా రేపు ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ‘మెగా యుఫోరియా’ పేరుతో రేపు ఉదయం 9 గంటలకు అప్ డేట్ ఉంటుందని అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేసి మరీ తెలిపింది.
అలాగే చిరంజీవి, దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో రానున్న యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. అయితే, ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోన్న మైత్రీ మూవీ మేకర్స్ మెగా బర్త్ డే రోజున ఒక ఆసక్తికర అప్ డేట్ ను పంచుకోనుంది. ‘మెగా వేవ్’ పేరుతో రేపు సాయంత్రం 4.05గంటలకు ఆ అప్ డేట్ ఉండనుందని ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్ బాగా ఆకట్టుకుంది. నిలిపి ఉన్న ఓడకు యాంకర్ వేలాడుతూ దాని వెనుక చిరంజీవి రూపం ఉన్న ఫొటో బాగా రివీల్ అవుతూ హైలైట్ గా అనిపించింది పోస్టర్. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే, ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు.
కాబట్టి, చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆచార్య రిలీజ్ డేట్ ను రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఆచార్య చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని ఇప్పటికే నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల టాక్. ఇక చిరు చేస్తోన్న మరో సినిమా ‘లూసిఫర్’ రీమేక్.
తమిళ దర్శకుడు మోహన్‌రాజా దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటివలే మొదలైంది. మరీ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్ డేట్ ను కూడా మెగా అభిమానులతో పంచుకుంటారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుండి టైటిల్ లేదా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇక తెలుగు చిత్రసీమకు మెగాస్టార్ పుట్టిన రోజు అంటే ఒక పండుగ. సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఆ రోజు ప్రత్యేక రోజు. చిరు ఇచ్చే పార్టీలో వారంతా కలిసి సందడి చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సారి చిరు బర్త్ డే పార్టీలో ఎలాంటి హడావుడి ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా కాలం మారినా, తరాలు మారినా మెగాస్టార్ లో ఇప్పటికీ అదే కోలాహలం, అదే ఉత్సాహం కనిపించడం నిజంగా విశేషమే.