మెగాస్టార్ ( MegaStar) చిరంజీవి పుట్టినరోజు రాబోతుంది. అందుకే, మెగా అభిమానులతో పాటు మెగా సన్నిహితులు, కుటుంబ సభ్యులు మెగాస్టార్ కి సర్ ప్రైజెస్ ఇవ్వడానికి సన్నద్ధం అవుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల (Sushmita Konidela) కూడా తన తండ్రి పుట్టిన రోజుకు ఒక ప్రత్యేక బహుమతి ఇవ్వడానికి రెడీ అయ్యారు.
సుస్మిత ఇటీవల తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే బ్యానర్ పై ఆమె సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. ఈ క్రమంలో జీ5 ఒరిజినల్ సిరీస్ షూట్ ఎఫైర్ ను నిర్మించింది సుస్మిత. కాగా ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజున మరో సిరీస్ కి సంబందించి ఓ ఆసక్తికర ప్రకటన చేయనుంది.
కాగా ఈ విషయాన్ని తాజాగా సుష్మిత స్వయంగా తన ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి మీ ముందుకు మరో అద్భుతమైన ఫన్ ను తీసుకురాబోతున్నామని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే, ఆ ఫన్ ఏమిటో డాడీ బర్త్‌డే సందర్భంగా ఆగష్టు 21. 8.2021 తేదీన చెబుతాను’ అంటూ ఆమె మెసేజ్ పెట్టారు.
ఇక ఆమె పోస్ట్ పెట్టింది ఒక వెబ్ ఫిల్మ్ గురించి అని తెలుస్తోంది. ఈ ఫిల్మ్ ను నూతన దర్శకుడు దిమ్మలపాటి ప్రశాంత్ దర్శకత్వం వహించాడు. ఈ ఫిల్మ్ లో కామెడీ హైలెట్ గా నిలుస్తోందట. పాత సినిమాలను కొత్తగా తీస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ తో ఈ సిరీస్ ను తీసారట.
ఇక సుష్మిత కాస్ట్యూమ్స్ డిజైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మెగాస్టార్ సైరా నరసింహ రెడ్డి సినిమాకి కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు.