Komaram Bheemudu Song: “కొమురం భీముడో” పాట ఎంత గొప్పగా హిట్ అయ్యిందో ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రతీకారం ప్రజ్వరిల్లింపజేయడానికి, ఆ సందర్భాన్ని వర్ణించడానికి రాసిన అలతి పదాల అచ్చ తెలుగు భావోద్వేగాపూరితా విప్లవ గేయం ఇది. అర్థం రాస్తున్నప్పుడు చివరి చరణం గుండెని తడి చేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ నటన ఈ పాటకు ప్రాణం అయ్యింది.

ఎన్టీఆర్ పాటలో నటించిన విధానం, అందుకు తగ్గ తీక్షణత, ఉద్విగ్నత, బావోద్వేగం, ఆవేశ ఆవేదనార్ద్రతా, ధైన్య భాధా భావాలు ఎన్టీఆర్ చాలా లోతుగా పలికించారు. అందుకే ఎన్టీఆర్ నటన అద్భుతం. ప్రస్తుతం ఈ పాటకి సంబంధించి పదాలకు అర్థాలు, వాటి మూలాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవేమిటో చూద్దాం.
*కొమురం భీముడో.. కొమురం భీముడో..
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో
కొమురం భీముడో .. కొమురం భీముడో..
రగరాక సూరీడై రగలాలి కొడుకో.. రగలాలి కొడుకో..*
పదబంధాలు:
నెగడు: కుప్పగా నిలువుగా పెట్టిన కట్టెల మంట. చాలా సేపు అలా రగులుతూ ఉంటుంది. పంట పొలాల్లో రైతులు కాపలాగా ఉన్నప్పుడు నెగళ్లు వేస్తుంటారు
రగరాక సూరీడై రగలాలి: అలా అలా మండుతున్న సూరీడుగా మారి రగిలి పోవాలి — ఆవేశం తెచ్చుకోమని
కోర్రాసు : ఓ రకమయిన చెట్టు కట్టే ఏమో మరి తెలియదు. ( ఉదాహరణకి: చింత కొమ్మలు, కట్టే లేదా మాను వెంటనే మండిపోదు. రగులుతూనే వుండి అతి వేడిమినీ ఇస్తుంది..అలాంటిది ఏమో మరి …)
అర్ధం:
ఓ కొమరం భీమా కోర్రాసు నెగడు మంటవలె రగులుతూనే, మండుతూనే(ఉద్రేకంతో, కోపంతో, ఆగ్రహంతో) ఉండాలి, అది ప్రజ్వరిల్లిస్తూనే(ఆరకుండా రగులుతూనే ) ఉండాలి కొడుకా
*కాల్మొక్తా బాంచెన్ అని వొంగితోగాల..
కారడవి తల్లికి పుట్టనట్టేరో.. పుట్టనట్టేరో..
జులుము గద్దెకు తలను ఒంచితోగాలా..
జుడుము తల్లి పేగున పెరగానట్టేరో.. *
పదబంధాలు:
ఒకవేళ : ఒకానొక సమయానికి అయితే/జరిగితే కనుక
గద్దె: రచ్చబండ, ఎత్తులో ఉన్నదీ, అధికారం(గద్దెనేక్కడం అంటారు రాజకీయాల్లో)
జులుముకి : జులుం అంటే అధికారంతో కూడిన అధర్మ బలప్రయోగం, అది చేసే అధికార ప్రభుత్వం
కారడవి:వెలుతురూ దూరని దట్టమయిన అడవి
అర్ధం:
కాలుమొక్కి ఒంగిపోతే(తలోంచితే) ఒకవేళ
కారడవి తల్లి వడిలో పుట్టని వానివే (అంటే, కారడవి గడ్డ మీద నీవు పుట్టని వానివే)
జులుం చేసే అధికారానికి భయపడి తలను వంచితే ఒకవేళ
నీవు అడివి తల్లి చెంతన పెరగనట్టే
* చర్మమొలిచే దెబ్బకు ఒప్పంతోగాల..
సిలికే రక్తం సూసి సెదిరేతోగాల..
బుగులేసి కన్నీరు ఒలికితోగాల..
భూతల్లి సనుబాలు తాగనట్టేరో.. తాగనట్టేరో.. *
అర్ధం:
చర్మంని ఒలిచేటట్టు కొట్టే దెబ్బలకి తాళలేక పోతే/తట్టుకోలేక పోతే ఒకవేళ
కారుతున్న రక్తం చూసి చెదిరితే ఒకవేళ
మనోధైర్యం పోయి కళ్ళ నీరు ఉబికి వస్తే ఒకవేళ
ఈ భూమి తల్లి చనుపాలు తాగలేదు ..తాగలేదు (అంటే .. పాలిచ్చి పెంచిన తల్లి మీద సహజ మమకారం ఉన్నట్టే , అలాగే ఈ భూమి తల్లి మీద నీకు మమకారం, ఆ బంధం లేనట్టే అని ..)

*కాలువై పారే నీ గుండె నెత్తురు
నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు
అమ్మకాళ్ల పారాణైతుంది సూడు
తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు*
పదబంధాలు:
నెత్తురు: రక్తం
నేలమ్మ : నేల + అమ్మ : నేల తల్లి/పుట్టిన గడ్డ
బొట్టైతుంది: నుదుటి బొట్టుగా అవుతున్నది
పారాణైతుంది: పెళ్లి లాంటి సందర్భాల్లో కాళ్ళకి పెట్టె ఎర్ర పారాణి (అలంకారంగా)
అర్ధం:
కాలువులా పారుతున్న నీ గుండె నెత్తురు
నేల తల్లి మీద పడి ఆ తల్లికి బొట్టులా అవుతున్నది చూడు
నీ రక్త ధారలు నేలమీద పడి ఆ తల్లి కాళ్ళ పారాణిలా మారి ఎండుతున్నది చూడు
అ తల్లి పెదాల మీద నవ్వుగా (అతని వీరత్వముతో ఆమెకి గర్వంతో కలిగిన మందహాసం) మెరిసింది చూడు
*కొమురం భీముడో.. కొమురం భీముడో..
పుడమి తల్లికి జన్మ అరణామిస్తివిరో కొమురం భీముడో..*
పదబంధాలు:
పుడమి: భూమి, పుట్టిన భూమి
అర్ధం:
పుట్టిన భూమి తల్లికి జన్మనీ జీవితాన్నిఅరణంగా ఇచ్చావురో కొమరం భీమా
Also Read:NTR: ఆ డైరెక్టర్ తో సినిమా ఏందీ..? ఎన్టీఆర్ తప్పుచేస్తున్నాడా?
[…] Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు సినీ పరిశ్రమ బాగు కోసమే తాపత్రయ పడతారు. ముఖ్యంగా కొత్త టాలెంట్ ను ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నిజానికి ఎక్కువగా హీరోలు మెగా ఫ్యామిలీ నుంచే వస్తున్నారు అంటూ తమ ఫ్యామిలీ పై చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేసినా.. చిరు మాత్రం బయట వ్యక్తులకు కూడా తన సపోర్ట్ ను అందించారు. అందిస్తూనే ఉన్నారు. […]
[…] Celebrities Arrested: అర్ధరాత్రి రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయ్యారు కొందరు సినీ ప్రముఖులు, అలాగే కొందరు ప్రముఖుల వారసులు. బంజారాహిల్స్‌లో నిన్న రాత్రి రాడిసన్ బ్లూ హోటల్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారం అందింది. టాస్క్‌ఫోర్స్ అధికారులు సడెన్ గా ఆ హోటల్ పై దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో ప్రముఖ నటుడు, నిర్మాత కూతురు, ఓ నటి కుమార్తె, మరియు బిగ్ బాస్ తెలుగు విజేత – ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, అలాగే కొందరు బడా బాబుల పిల్లలు అడ్డంగా బుక్ అయ్యి.. నేటి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. […]
[…] Bigg Boss Non Stop OTT Telugu: బిగ్ బాస్ షో నాన్ స్టాప్ గా ఓటీటీ వేదికగా అలరిస్తూనే ఉంది. గతం కంటే చాలా భిన్నమైన టాస్క్ లతో కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే నాలుగు వారాల సీజన్ లో ఎలాంటి చిత్రవిచిత్రమైన టాస్క్ లు పెట్టాడో మనం చూస్తున్నాం. ఇలాంటి సర్ ప్రైస్ టాస్క్ లే కాకుండా.. ఊహించని ఘటనలు కూడా జరుగుతున్నాయి. మొదటి నుంచి బిగ్ బాస్ లో నామినేషన్స్ ప్రక్రియనే చాలా టఫ్ గా ఉంటుంది. […]