
కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను తీవ్రంగా కుదిపేసింది. మార్చి నుంచి షూటింగ్స్ ఆగిపోవడంతో చాలా మంది దర్శక నిర్మాతలు, హీరోహీరోయిన్లు, సాంకేతిక నిపుణులు ఖాళీగా ఉంటున్నారు. అన్‌లాక్‌లో భాగంగా షూటింగ్స్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా కరోనా విజృంభణ నేపథ్యంలో సెట్స్‌పైకి వెళ్లేందుకు చాలా మంది ఇప్పటికీ భయపడుతున్నారు. కొన్ని చిన్నాచితకా సినిమాలు, సీరియల్ షూటింగ్స్ మాత్రమే తిరిగి మొదలయ్యాయి. పెద్ద సినిమాల పరిస్థితి ఇంకా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. షూటింగ్స్ లేకపోవడం ప్రధానంగా సినీ కార్మికులను తీవ్రంగా దెబ్బ తీస్తోంది. ఉపాధి కరువై వారంతా పస్తులుంటున్నారు. టాలీవుడ్‌లో కరోనా క్రైసిస్ చారిటీ ట్రస్ట్ సహా పలు సంస్థలు, దాతలు సాయం చేస్తున్నా.. వారికి రెండు పూటలా ముద్ద దిగడం కష్టంగా మారింది. మరోవైపు థియేటర్లు మూత పడడంతో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాల విడుదల సస్పెన్స్‌గా మారింది. ప్రింట్లు ల్యాబుల్లో ఉంచడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో వారికి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.
Also Read: ఎంఎంఏ ఫైటర్గా విజయ్ దేవరకొండ!
మొన్నటిదాకా బడా ప్రొడ్యూసర్లు సిండికేట్‌గా మారి థియేటర్లు తమ గుత్తాధిపత్యంలో ఉంచుకున్నారు. చిన్న సినిమాల కోసం వారం రోజులు కూడా కొన్ని థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అవే చిన్న సినిమాలు అలా చిత్రీకరణ పూర్తి చేసుకొని ఇలా ఓటీటీలో దర్జాగా రిలీజ్ అవుతున్నాయి. మంచి లాభాలు కూడా గడిస్తున్నాయి. ఇప్పట్లో థియేటర్లు మొదలైన కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకూ జనాలు థియేటర్లకు వచ్చే అవకాశం లేకపోవడంతో బడా నిర్మాతలు సైతం ఓటీటీల బాట పడుతున్నారు. లాభం మాట దేవుడెరుగు నష్టాలనైనా తప్పించుకునేందుకు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ దిగ్గజాలతో బేరాలకు దిగాయి. ఈ క్రమంలో నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ చిత్రం ఓటీటీలో రిలీజయ్యే తెలుగు పెద్ద సినిమా కానుంది. వచ్చే నెల 5వ తేదీన ఆ మూవీ అమెజాన్‌లో స్ట్రీమ్ కానుంది. అనుష్క ‘నిశ్శబ్దం’ కూడా అమెజాన్‌తో చర్చలు జరుపుతోంది. దాంతో, సౌత్‌లో మిగతా ఇండస్ట్రీలు కూడా ఓటీటీల వైపు చూస్తున్నాయి. డిజిటల్ మీడియాను ముందు నుంచి ఎంకరేజ్ చేస్తూ వస్తున్న తమిళ్ స్టార్ హీరో సూర్య ఓ అడుగు ముందుకేశాడు. తన తాజా చిత్రం సూరరై పొట్రు (తెలుగులో ఆకాశమే నీ హద్దురా)ను అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు.
Also Read: తనకు ప్రభాస్ హీరోయినే కావాలంటున్న బన్నీ?
థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు వారించినా సూర్య డిజిటల్‌కే జై కొట్టాడు. సూర్య లాంటి బడా హీరో ఓటీటీ బాట పట్టడంతో తమిళ్‌లో మిగతా హీరోలు, దర్శక నిర్మాతలు సైతం అదే బాటలో నడవడం ఖాయమైంది. ఇప్పుడు మరో అగ్ర నటుడు విజయ్ నటించిన ‘మాస్టర్’పై అందరి దృష్టి పడింది. ‘ఖైదీ’ ఫేమ్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కరోనా లేకపోయి ఉంటే వేసవిలోనే రిలీజయ్యేది. మరో టాప్ హీరో విజయ్ సేతపతి విలన్‌గా నటించడంతో ‘మాస్టర్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. థియేటర్ల ప్రారంభంపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం లేకపోవడంతో పాటు మురుగదాస్‌తో తన తదుపరి చిత్రం షూటింగ్ ప్రారంభించాలని విజయ్ రెడీ అవుతున్నాడు. ఇది విజయ్‌కు 65వ చిత్రం కానుంది. ఆ మూవీ చిత్రీకరణ మొదలైతే అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. దాంతో ఈ లోపే ‘మాస్టర్’ను విడుదల చేయాలని విజయ్ భావిస్తున్నాడట. మంచి ఆఫర్ వస్తే ఓటీటీలో నేరుగా రిలీజ్ చేస్తే బాగుటుందని చూస్తున్నట్టు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సూర్య మాదిరిగా ఓటీటీకి జై కొట్టడం తప్ప మరో ఆప్షన్ లేదంటున్నాడట. ఏం జరుగుతుందో చూడాలి.