Anil Ravipudi: కామెడీ ని పుట్టించడం అంత తేలికైన విషయం కాదు. మాస్ సన్నివేశాలను సినిమా పరిజ్ఞానం ఉన్నటువంటి ఏ డైరెక్టర్ అయినా తియ్యగలడు. కానీ ప్రేక్షకుల చేత కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలను తీయడం మాత్రం చాలా కష్టం. సీరియస్ మూడ్ లో వెళ్తున్న సినిమాలో కామెడీ సన్నివేశాలు రాయడం వేరు, సినిమా మొత్తం కామెడీ జానర్ లో తీయడం వేరు. అలా మన టాలీవుడ్ లో కామెడీ జానర్ సినిమాలు తీసే డైరెక్టర్స్ సంఖ్య రోజురోజుకు తగ్గిపోతూ ఉంది. ఒకప్పుడు జంధ్యాల, ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ కామెడీ జానర్ సినిమాల్లో తిరుగులేని లెజెండ్స్ గా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళ తర్వాత ఈ జానర్ లో అంతటి పేరు తెచ్చుకున్నది శ్రీను వైట్ల మాత్రమే. ఈయన పాత సినిమాల్లోని సన్నివేశాలను ఇప్పటికీ చూసుకొని నవ్వుకుంటూ ఉంటాము. కానీ ఇప్పుడు ఆయనలో కూడా పస తగ్గిపోయింది. ఫలితంగా సినిమా అవకాశాలు లేవు.
శ్రీను వైట్ల రేంజ్ లో కాకపోయినా, కాస్త కామెడీ జానర్ లో మంచి సినిమాలు తీసే డైరెక్టర్ గా మారుతీ కి మంచి పేరు ఉండేది. కానీ ‘పక్కా కమర్షియల్’ చిత్రం తో మొదటిసారి కామెడీ జానర్ లో గాడి తప్పాడు. ఇక నేడు విడుదలైన ‘రాజా సాబ్’ చిత్రం తో శ్రీను వైట్ల లాగానే ఈ డైరెక్టర్ కూడా శాశ్వతంగా షెడ్డులోకి వెళ్ళిపోనట్టే. మీడియం రేంజ్ సినిమాలు తీసుకునే మారుతీ కి ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ పిలిచిమరీ అవకాశం ఇస్తే, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం లో మారుతీ నూటికి నూరు శాతం విఫలం అయ్యాడు. ఇక మన టాలీవుడ్ కి మిగిలిన ఏకైక కామెడీ జానర్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటి వరకు 8 సినిమాలు తీసాడు. ఈ 8 కూడా ఒకదానిని మించి ఒకటి హిట్ అవుతూ వచ్చాయి.
గత ఏడాది ఈయన విక్టరీ వెంకటేష్ తో తీసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి. ఇప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవి తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ ఎక్కడ ఈ డైరెక్టర్ కూడా మారుతి లాగా దొరికిపోతాడో అనే చిన్న భయం మాత్రం ప్రేక్షకుల్లో ఉంది. ఒకే ఒక్క సినిమా చాలు, జాతకం తలక్రిందులు అవ్వడానికి, దూకుడు, బాద్ షా వంటి భారీ హిట్స్ తీసిన శ్రీను వైట్ల, ఆ తర్వాత తీసిన ‘ఆగడు’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో కెరీర్ క్లోజ్ అయిపోయింది , ఇప్పుడు అనిల్ రావిపూడి కి కూడా అలాంటి ప్రమాదమే ఉంది. మరి జనవరి 12న రావిపూడి మరోసారి హిస్టరీ క్రియేట్ చేస్తాడా?, లేదా దొరికిపోతాడా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం.