తెలుగు చిత్రపరిశ్రమలో మంచు ఫ్యామిలీ ప్రత్యేకమైనది. మోహన్ బాబు గురించి ఎవరు మాట్లాడినా.. క్రమశిక్షణ ప్రస్తావన తప్పకుండా వస్తుంది. అన్ని విషయాల్లోనూ ఆయన నిక్కచ్చిగా ఉంటారని చెబుతుంటారు. ఇంట్లో వారసులు సైతం ఆయన డిసిప్లెయిన్ గురించి చెబుతుంటారు. అలాంటి మోహన్ బాబు కుటుంబంలో గొడవులు జరుగుతున్నాయని కొంతకాలంగా ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. అన్నదమ్ములు విష్ణు, మనోజ్ మధ్య ఆస్తి విషయంలో పంచాయతీ కొనసాగుతోందనే ప్రచారం ఉంది. తాజాగా ఈ విషయమై విష్ణు స్పందించారు.
‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి వచ్చిన విష్ణు.. కెరీర్ విషయాలతోపాటు పర్సనల్ విషయాలు కూడా పంచుకున్నారు. ఇందులో భాగంగా.. మనోజ్ తో గొడవల అంశంపైనా ఓపెన్ అయ్యాడు విష్ణు. మంచు ఫ్యామిలీతో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఎలాంటి మొహమాటం లేకుండా ప్రశ్నలు వేశాడు అలీ. ‘నీకు మీ తమ్ముడికి గొడవలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత?’ అని అలీ ప్రశ్నించాడు.
దీనికి తొలుత సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు విష్ణు. సీటు నుంచి లేచి నిలబడి.. ఒంటిమీది కోటును విప్పేస్తూ.. ఈ ప్రచారంపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. మా పర్సనల్ విషయాలు వాళ్లకెందుకు? అని ప్రశ్నించాడు. తమ్ముడితో నీకు ఎలాంటి గొడవలూ లేవా? అని అడిగితే.. అలాంటిది ఏమీ లేదని చెప్పాడు విష్ణు. అయితే.. మనోజ్ వేరుగా ఉంటున్నాడని మాత్రం చెప్పాడు.
అక్క లక్ష్మి తన ఫ్యామిలీతో వేరుగా ఉంటోందని, అదే విధంగా.. తమ్ముడు మనోజ్ కూడా వేరుగానే ఉంటున్నాడని చెప్పాడు. తాను తండ్రి మోహన్ బాబుతో కలిసి ఉంటున్నట్టు చెప్పాడు. తమ గురించి ఏదేదో మాట్లాడే వాళ్లకు సమాధానం చెప్పాల్సిన పనిలేదన్నాడు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ట్రెండింగ్ లో ఉంది. అయితే.. విష్ణు సమాధానం విన్న తర్వాత ఇంకా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు
మనోజ్ తన భార్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇంకా సింగిల్ స్టేటస్ నే కొనసాగిస్తున్నారు. అలాంటప్పుడు విడిగా ఉండాల్సిన అవసరం ఏంటీ? అన్నది వారి లా పాయింటు. గొడవలు జరగకపోతే.. ఒక్కడు వీరి నుంచి విడిపోయి ఉండడమేంటీ? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. విష్ణు ఇచ్చిన సమాధానంతో అన్నదమ్ములు వేరుగా ఉంటున్నారనే విషయం తేలిపోయిందని, గొడవలు జరగడం వల్లనే విడిగా ఉంటూ ఉండొచ్చని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు.