Mana Shankara Varaprasad Garu: ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం 10 రోజుల నుండి బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లను చూసి ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టారు. ఈమధ్య కాలం లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి ఈ రేంజ్ లో కదిలి రావడం ఎప్పుడూ చూడలేదని, మెగాస్టార్ చిరంజీవి చరిత్ర సృష్టించాడని ప్రశంసలతో ముంచి ఎత్తారు. అయితే 11వ రోజు, 12వ రోజున వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ జోరు ఇక తగ్గిపోయినట్టే అని అనుకున్నారు అందరూ. కానీ నిన్న ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లోనూ భారీగా పుంజుకుంది. ముఖ్యంగా బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి లక్షకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోవడం హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా సినిమాలకే ఆ రేంజ్ బుకింగ్స్ ఈమధ్య కాలం లో జరగలేదు.
అలాంటిది మెగాస్టార్ అవలీలగా ఈ చిత్రానికి రెండవ శనివారం కూడా లక్ష టిక్కెట్లు అమ్ముడుపోయేలా చేసాడంటే, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. లక్ష టిక్కెట్లకు గానూ తెలుగు రాష్ట్రాల నుండి 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని , షేర్ వసూళ్లు దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయలకు వరకు ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక నేడు అయితే ఈ చిత్రానికి ప్రతీ సెంటర్ లోనే అడ్వాన్స్ హౌస్ ఫుల్స్ నమోదు అవ్వడం విశేషం. సంక్రాంతికి విడుదలైన సినిమాలకు కేటాయించిన థియేటర్స్ ని తొలగించి మరీ ‘మన శంకర వరప్రసాద్ గారు’కి కేటాయిస్తున్నారు బయ్యర్స్. రేపు కూడా సెలవు దినం కావడం తో రేపటికి కూడా అడ్వాన్స్ హౌస్ ఫుల్స్ నమోదు అయ్యాయి. చూస్తుంటే థియేట్రికల్ రన్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు, ఫిబ్రవరి 2వ వారం వరకు కొనసాగేలా ఉంది.
ఇకపోతే 13 రోజులకు గానూ ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 263 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 163 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. 122 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రానికి 40 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి. ఫుల్ రన్ లో 50 కోట్ల లాభాలను అందుకున్న సినిమాగా నిలవనుంది ఈ చిత్రం. అయితే 300 కోట్ల గ్రాస్ ని ఈ చిత్రం ఫుల్ రన్ లో అందుకుంటుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ లాగానే అనిపిస్తోంది. ఎల్లుండి నుండి ఈ చిత్రానికి నమోదు అయ్యే వసూళ్లను బట్టే 300 కోట్ల గ్రాస్ ని చేరుకుంటుందా లేదా అనేది తెలుస్తుంది.