Mahesh – Rajamouli : ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి ఆస్కార్ రేంజ్ కి వెళ్లారు. ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ దర్శకుడు రాజమౌళికి గ్లోబల్ ఫేమ్ తెచ్చింది. హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం ఊహించని ఫేమ్ రాబట్టారు. ఇక నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. ఇండియన్ సినిమా కీర్తి ఇనుమడింపచేసింది. ఈ విజయాన్ని ప్రతి భారతీయుడు జరుపుకున్నారు. జేమ్స్ కామెరూన్, స్టీఫెన్ స్పీల్బర్గ్ వంటి దిగ్గజాలు ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని కొనియాడారు.
దీంతో రాజమౌళి బాధ్యత మరింత పెరిగింది. ఆయన నెక్స్ట్ మూవీ మరో లెవెల్ లో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అందుకు తగ్గట్లే రాజమౌళి సిద్ధం అవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ తో ఆయన చేయనున్న సినిమా హాలీవుడ్ చిత్రాలను తలదన్నేలా ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో మహేష్ మూవీ ఉండనుంది. బడ్జెట్ రూ. 800 నుండి 1000 కోట్ల వరకు కేటాయించారు.
ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకుని యూనివర్సల్ సబ్జెక్టు ఎంచుకున్నారు. ఇది జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా అని ఇప్పటికే అధికారికంగా చెప్పారు. హాలీవుడ్ సక్సెస్ఫుల్ సిరీస్ ఇండియానా జోన్స్ మాదిరి ఉంటుందని అన్నారు. మహేష్ రోల్ ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా ఉంటుందట. హాలీవుడ్ యాక్టర్స్, టెక్నీషియన్స్ పని చేయనున్నారు.
తాజాగా ఈ ప్రాజెక్ట్ పై మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ లీక్ చేశాడు రైటర్ విజయేంద్ర ప్రసాద్. మహేష్ చిత్రానికి ఆయన ఓపెన్ ఎండ్ క్లైమాక్స్ రాశారట. అంటే కథ ఇంకా మిగిలే ఉంది అన్నట్లుగా క్లైమాక్స్ ఉంటుందట. కాబట్టి మహేష్ చిత్రానికి సీక్వెల్ ఉండేలా ముగింపు ఇస్తున్నామన్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.